మహేష్ సినిమాలో చేయడం వల్ల ఒరిగిందేమీ లేదంటున్న బండ్ల గణేష్
ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన `వినోదం` చిత్రంతో నటుడిగా పరిచయమైన బండ్ల గణేష్ ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా నటించాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ చిత్రాలు నిర్మించాడు. టాలీవుడ్లో టాప్‌స్టార్స్‌తో సినిమాలు నిర్మించిన గణేష్ ఆర్థికంగా నష్టపోయాడు. దాంతో సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. తన సొంత బిజినెస్ అయిన పౌల్ట్రీ బిజినెస్‌లో కూడా నష్టాలు చవి చూశాడు. దీంతో మళ్లీ నటుడిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సూపర్‌హిట్ అయినప్పటికీ అతని క్యారెక్టర్‌కి సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల ఈ సినిమాలోని తన క్యారెక్టర్ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నేను నటించకుండా ఉండాల్సింది అంటూ వాపోయాడు. ఈ సినిమాలో తాను చేసిన పాత్రను చూసి తన పిల్లలు తిట్టారని చెప్పుకొచ్చాడు. సినిమా సూపర్‌హిట్ అయినా తన కెరీర్‌కు ఆ సినిమా ఎంతమాత్రం ఉపయోగపడలేదని అన్నాడు. అంతేకాదు ఇకపై తాను సినిమాల్లో నటించనని తెగేసి చెప్పాడు. ఒకవేళ నటించాల్సి వస్తే గుండెలు పిండేసే పాత్ర ఏదైనా వస్తే చేస్తానన్నాడు.













