అక్టోబర్ 1న ఖమ్మం జిల్లాకు నందమూరి బాలకృష్ణ
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో టీడీపీ నేత సండ్ర వీరయ్య తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతోపాటు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్టోబర్ 1న కృష్ణాజిల్లా నందిగామ నుంచి ఖమ్మంలోని మధిరకు బాలకృష్ణ చేరుకుంటారు. అనంతరం రాయపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. మధిర అంబేద్కర్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి, దెందుకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బోనకల్ మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో సైతం ఎన్టీఆర్ రామారావు విగ్రహాలను బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. భోజనం తర్వాత సత్తుపల్లి నియోజకవర్గానికి చేరుకుని టీడీపీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తరపున ప్రచారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బాలయ్య ఈ సభకు వస్తున్న నేపథ్యలో తెలుగుశం పార్టీ శ్రేణులు భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నాయి.













