స్కంద కు బాలయ్య సపోర్ట్
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న చిత్రం స్కంద. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ముందూ వెనుకా వచ్చే సినిమాల ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్ల విషయంలో స్కంద కాస్త వెనుక పడిందనే చెప్పాలి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ దాదాపు 45 కోట్ల దాకా అయిందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లకు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రానున్నాడని తెలుస్తోంది. త్వరలో జరగనున్న స్కంద ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బాలయ్య చీఫ్ గెస్టుగా రానున్నాడని సమాచారం. బోయపాటితో తనకున్న స్నేహం, అనుబంధం కారణంతో బాలయ్యను అడగ్గానే ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను 26న శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు స్కంద నుంచి టీజర్ తప్ప ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు. యాక్షన్ డ్రామా అని ముందే తెలిసినప్పటికీ కథ నేపథ్యం ఏంటన్నది మాత్రం ఇప్పటివరకు ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ రాకపోయినా మెల్లిగా జనాలకు ఎక్కుతున్నాయి. ఇదిలా ఉంటే స్కంద సినిమాకు చాలా పోటీలే ఉన్నాయి. ఈ సినిమాకు వారం ముందు జవాన్ రానుంది. సెప్టెంబర్ 15 రోజునే చంద్రముఖి2, మార్క్ ఆంటోనీ సినిమాలు రానున్నాయి. డబ్బింగ్ సినిమాలే అయినా ఈ రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. స్కందకు మంచి టాక్ వస్తే ఈ పోటీ ఏమీ చేయలేదనేది వాస్తవం. ది వారియర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రామ్, ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.













