మరోసారి ఆ సెంటిమెంట్‌నే నమ్ముకున్న బాలయ్య
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో ఏదైనా సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఆ సెంటిమెంట్ ను తర్వాత కూడా తెగ రిపీట్ చేస్తుంటారు దర్శకులు. అయితే ఈ సెంటిమెంట్ ఎక్కువ సార్లు వర్కవుట్ అయినా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుండటం కూడా గమనార్హం.
సీనియర్ హీరో బాలకృష్ణ గత కొన్నేళ్లుగా ఒకే ఫార్మాట్ లో మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన సింహాతో మొదలైన ఈ ట్రెండ్‌ను ఇప్పటికీ బాలయ్య కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆ ట్రెండ్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా. బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించడమే ఆ సెంటిమెంట్.
సింహా, లెజెండ్, అఖండ, రీసెంట్గా వచ్చిన వీరసింహా రెడ్డి సినిమాల్లోనూ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుని మంచి హిట్స్ అందుకున్న బాలయ్య, బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమాలోనూ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను తీసుకోవాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తుండగా, ఆ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













