సూపర్‌స్టార్ కృష్ణకు చంద్రబాబు పరామర్శ
ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ నెల 27న సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల అనారోగ్యంతో మరణించారు. అయితే ఆ సమయంలో నేతలతో సమీక్షలతో బిజీగా ఉన్న చంద్రబాబు కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలోని కృష్ణ నివాసాని చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వచ్చారు. విజయనిర్మల చిత్ర పటానికి పూలమాల వేసి, చంద్రబాబు, భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం సూపర్‌స్టార్ కృష్ణను చంద్రబాబు ఓదార్చారు. ఇటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. విజయనిర్మల మృతికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మృతి సినిమా రంగానికి తీరని లోటని, 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిగ్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం ద్వారా చరిత్ర పుట్టల్లో నిలిచారని కొనియాడారు. సూపర్‌స్టార్ కృష్ణను పరామర్శించిన వారిలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మాంత్రి నారా లోకేష్ ఉన్నారు.













