ఆ మాత్రం రిస్క్ చెయ్యాల్సిందే..
సింహా, లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమధ్య షూటింగ్ ప్రారంభమైనప్పటికీ లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ లాక్డౌన్ సమయంలో తను రాసుకున్న కథకు మరిన్ని మెరుగు దిద్దే పనిలో ఉన్నాడు బోయపాటి. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోకి అవకాశం ఉందని బోయపాటి మొదటి నుంచీ చెప్తున్నాడు. అయితే ఎవరిని ఆ పాత్రలోకి తీసుకుంటారనేది వెల్లడించలేదు. తాజా సమాచారం మేరకు కొన్ని సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఆ క్యారెక్టర్ చేసే అవకాశం ఉందట. అతనైతేనే ఆ క్యారెక్టర్‌కు సూట్ అవుతాడని బోయపాటి భావిస్తున్నాడని తెలుస్తోంది. కథను మలుపు తిప్పే ఆ క్యారెక్టర్లో బాగా తెలిసి ఉన్న నటుడైతే బాగుంటుందని భావించిన బోయపాటి ఫైనల్‌గా వేణుని ఎంపిక చేసారని సమాచారం. గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘దమ్ము’ చిత్రంలో కూడా వేణు నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల చిన్నతనంలోనే విడిపోయిన ఇద్దరు… ఒకరు వారణాసిలో, మరొకరు అనంతపురంలో పెరుగుతారు. ఇందులో ఒకరు అఘోరాగా కనిపిస్తారు. ఆ పాత్రను క్రియేట్ చెయ్యడం వెనుక కారణం ఏమిటనేది బోయపాటి వివరిస్తూ… ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా నటిస్తున్న మాట వాస్తవమే. అయితే ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశాం. ఏవిధంగా ప్రజెంట్ చెయ్యబోతున్నామనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పటివరకు బాలకృష్ణ చెయ్యని క్యారెక్టర్ కావడంతో ఆడియన్స్‌లో భారీ అంచనా అనేది ఉంటుంది. రెగ్యులర్‌గా చేసే క్యారెక్టర్ కాకుండా డిఫరెంట్‌గా ఉంటే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాం. దీనికి బాలయ్యబాబు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవ్వాలంటే ఆ మాత్రం రిస్క్ చెయ్యాల్సిందేనని బాలయ్యబాబు అభిప్రాయపడుతున్నారని తెలిపారు బోయపాటి.













