సంప్రదాయాలను తెలియజేయడానికి ఎన్టీఆర్ బయోపిక్
మరుగున పడుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించామని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామాన్ని నటులు విద్యాబాలన్, కల్యాణ్‌రామ్‌లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు ముందు తమ తల్లిదండ్రులైన ఎన్టీఆర్, బసవరామతారకం ఆశీస్సులతో పాటు బంధుమిత్రులకు కలిసి వారి ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం చిత్రీకరణ మరో పదిరోజుల్లో పూర్తవుతుందన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన నాన్న ఎన్టీఆర్‌కి అమ్మ బసవ రామతారకం అదృష్టమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కమర్షియల్ హీరో అయినప్పటికీ మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేసి సందేశం ఇచ్చేవారన్నారు. నిమ్మకూరు గ్రామానికి వస్తే తన తల్లిదండ్రులతో పాటు 17 ఏళ్లపాటు తాత గారి వద్ద పెరిగిన అన్న హరికృష్ణ కూడా గుర్తొస్తున్నారన్నారు. మండలి వెంకటకృష్ణ పాత్రలో ఆయన కుమారు మండలి బుద్ధప్రసాద్, కోట్ల విజయభాస్కరెడ్డి పాత్రలో వర్ణ రామయ్య, హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్ నటించారన్నారు.
తొలుత గ్రామంలోని ఎన్టీఆర్, బసవరామతారకం కాంస్య విగ్రహాలకు బాలకృష్ణ, విద్యాబాలన్, కల్యాణ్‌రామ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురుకుల, కళాశాల, పాఠశాల విద్యార్థులు చిత్ర బృందానికి స్వాగతం పలికారు.













