సహజమైన పాత్రల్లో.. భావోద్వేగాలతో… ఆకట్టుకున్న ‘బలగం’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్
నటీనటులు: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు…
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు, సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత, దర్శకుడు : వేణు యెల్దండి (వేణు టిల్లు)
విడుదల తేదీ: 03.03.2023
దర్శకుడు తేజ ‘జై’ చిత్రంతో కమెడియన్‌గా టాలీవుడ్ కి పరిచయం అయిన వేణు టిల్లు, బజర్దస్త్ ప్రారంభంలో స్కిట్స్‌తో ప్రేక్షకులను నవ్వించిన వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. కొత్త టాలెంట్‌ను, డిఫరెంట్ సినిమాలను ఎంకరేజ్ చేయటానికి ఆసక్తి చూపించే నిర్మాత దిల్ రాజు, ‘దిల్‌రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా కొనసాగారు. ఇంతకీ ‘బలగం’ సినిమాతో దర్శక నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
తెలంగాణలోని ఓ పల్లెటూర్లో ఉండే కొమురయ్య (సుధాకర్ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి)కి రెండు రోజుల్లో నిశ్చతార్థం ఉంటుంది. వచ్చే కట్నం డబ్బులతో పది లక్షల కట్నం వస్తే అప్పులను తీర్చుకోవాలనేది సాయిలు ఆలోచన. అయితే అనుకోని కారణాలతో తాత కొమురయ్య చనిపోతాడు. కొమురయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య (జయరాం), మొగిలయ్య, ఒక కుమార్తె లక్ష్మి ఉంటారు. లక్ష్మి భర్త నారాయణ (మురళీధర్)తో ఐలయ్య, మొగిలయ్యలు ఇరవై ఏళ్ల క్రితం చిన్న గొడవ పడతారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలుండవు. కొమురయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత లక్ష్మి, నారాయణ..ఐలయ్య ఇంటికి వస్తారు. కర్మకాండల సమయంలో కాకులకు పెట్టే ముద్దలను కాకి ముట్టనే ముట్టదు. అసలు కాకులు ఎందుకలా చేస్తున్నాయో అర్థం కావు. మరో వైపు అప్పుల ఇబ్బందుల్లో ఉన్న సాయిలుకి మామయ్య నారాయణకి చాలా ఆస్తులున్నాయని తెలుస్తుంది. ఎలాగైనా కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)ను ప్రేమలో పడేసి, పెళ్ళి చేసుకుని.. అప్పు తీర్చేయాలని ప్లాన్ వేస్తాడు. దాంతో సంధ్య ని ప్రేమలో దించే ప్రయత్నం చేస్తాడు. అసలు సాయిలు ఎందుకు అప్పుల పాలవుతాడు?. కొమురయ్యకు పెట్టే ముద్దను కాకులు ఎందుకు ముట్టవు? చివరకు గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఎలా కలిశారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటి నటుల హావభావాలు:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు తాత పాత్రధారి చిత్ర కథానాయకుడుగా కొమురయ్య పాత్రలోనటించిన సుధాకర్ రెడ్డి అనే చెప్పాలి. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ తను చక్కగా నటించారు. అలాగే తన చుట్టూనే సినిమా నడుస్తుంది. ఇక ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సహజ మైన జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగజేసారు. క్లైమాక్స్ ముందుకు వరకు సెల్ఫిష్ యువకుడిగా కనిపిస్తూ వచ్చిన ప్రియదర్శి క్లైమాక్స్‌లో తాతయ్యను తలచుకుంటు బాధపడే సీన్లో చక్కగా నటించాడు. ప్రియదర్శి తండ్రి పాత్రలో నటించిన జయరాం, మామయ్య పాత్రలో నటించిన మురళీ ధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గ్రామస్థులు గా నటించిన నటులు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఆ గ్రామం మధ్యలో, మన చుట్టూనే సన్నివేశాలు జరుగుతున్నాయన్న ఫీలింగ్ కలగజేస్తూ ఒకరేటిమిటి సినిమాలో ప్రతీ పాత్రలో నటీనటులుఅద్భుతంగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా తొలి సినిమానే అయినప్పటికీ ఎంత కష్టపడ్డాడనేది స్క్రీన్‌పై కనిపిస్తుంది.ఎలాంటి కమర్షియల్ హంగులకు పోకుండా ఎమోషన్స్‌తో సినిమాను నడిపించటం అనేది చాలా కష్టం. ఆ పనిలో వేణు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. మనుషుల్లో మార్పు వచ్చే సందర్భంలో తెలంగాణ బుర్ర కథను వాడుకున్న తీరుకి వేణుని అప్రిషియేట్ చేయాల్సిందే. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలతో పాటు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బావుంది. తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ బావున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
విశ్లేషణ:
తెలంగాణ యాస, ఆ ప్రాంతాలను, అక్కడి మనుషులను హైలైట్ చేయటం వంటి కథలు సక్సెస్ ఫార్ములాగా మారిందనే చెప్పుకోవాలి. అలాంటి ప్రయత్నమే చేశాడు వేణు. అయితే ఇక్కడ పక్కా కమర్షియల్ ఫార్ములాలో పెద్ద హీరో, అదిరిపోయే డాన్సులు భారీ ఫైట్స్‌లతో ఈ సినిమాను తెరకెక్కించలేదు. తెలంగాణలోని మారుమూల పల్లెటూళ్లో మనుషుల మధ్య బంధాలు, గొడవలను, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని బలగం’ సినిమాను రూపొందించారు. కుటుంబాల మధ్య గొడవలుంటాయి. వాటిని హీరో సాల్వ్ చేసి అందరినీ కలిపే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే బలగం’ సినిమాను పూర్తి భిన్నంగా నడిపారు. చావు తర్వాత జరిగే పరిణామాలను చూపిస్తూ అప్పుడు మనుషుల మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి. ఎదేని విషయాన్ని పల్లెటూర్లలో ఎలా చర్చించుకుంటారు అనే అంశాలను రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. పరిస్థితులను బట్టి దూరమైన మనుషులు మళ్లీ.. అదే పరిస్థితుల కారణంగా ఎలా ఒకటయ్యారనే విషయాన్ని హృద్యంగా చిత్రీకరించారు. అయితే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ బలగం సినిమా నిలిచిపోతుంది.













