‘అవతార్ 2’ షూటింగ్ పూర్తి – నాలుగు సీక్వెల్స్ రిలీజ్ డేట్స్‌ను ప్రకటించిన జేమ్స్ కేమరాన్
సంచలన దర్శకుడు జేమ్స్ కేమరాన్ అద్భుత సృష్టి `అవతార్` ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన విషయం తెలిసిందే. చాలాకాలం క్రితమే అవతార్‌కు సీక్వెల్స్ చాలా ఉంటాయని ప్రకటించాడు జేమ్స్. ఆయన చెప్పినట్టుగానే 2, 3, 4, 5 భాగాలకు సంబంధించిన వర్క్ మొదటు పెట్టేశారు. ఇటీవల అవతార్ 2 షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు జేమ్స్. అంతేకాదు, అవతార్ తర్వాత సీక్వెల్స్‌గా రూపొందే నాలుగు భాగాల రిలీజ్ డేట్స్‌ను కూడా ఇప్పుడే ప్రకటించేశాడు.
`అవతార్ 2’ షూటింగ్‌ను న్యూజిలాండ్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కారణంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించారు. దానివల్ల అవతార్ 2 షూటింగ్‌ను నిలిపివేశారు. ఇప్పటికే చాలా దేశాలు సడలింపులు ఇవ్వడంతో ఎంతో కాలంగా ఆగిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అవతార్ 2 షూటింగ్‌ను కూడా పూర్తి చేశాడు జేమ్స్ కేమరాన్. ఈ సినిమాను మొదట డిసెంబర్ 17, 2021లో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను 16 డిసెంబర్ 2022కు మార్చారు. అవతార్ 2 తర్వాత రూపొందించబోయే 3, 4, 5 భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తి చేశామని జేమ్స్ కేమరాన్ తెలిపారు. ఈ సీక్వెల్స్ అన్నింటినీ డిస్నీ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఇందులోని మూడో భాగం షూటింగ్ కూడా 90 శాతం పూర్తయిందని తెలుస్తోంది. అవతార్ 3 చిత్రాన్ని 20 డిసెంబర్ 2024లో, అవతార్4ను 2026 డిసెంబర్ 18న, ‘అవతార్ 5’ను 22 డిసెంబర్ 2028న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు జేమ్స్. ఇంత భారీ చిత్రాలను రూపొందించడమే కాకుండా ఆయా సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్‌ను కూడా ప్రకటిండం విశేషం. అవతార్ సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సినిమా హైదరబాద్‌లోని ఐమాక్స్ థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. ఈ సినిమాకి నాలుగు సీక్వెల్స్ రాబోతున్నాయని ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవతార్ అభిమానుల ఈ సీక్వెల్స్ కోసం ఎదురుచూస్తున్నారు.













