నెక్ట్స్ లెవెల్ లో అనుష్క ప్లానింగ్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క వరుసగా సినిమాలు చేస్తుందనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఆశలకు భిన్నంగా అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తుంది. విశ్వంభరలో చిరూకు జోడీగా ప్రధాన హీరోయిన్ గా త్రిష కంటే ముందు స్వీటీనే అనుకున్నారు కానీ తనతో పాటూ మరో ముగ్గురు స్క్రీన్ షేర్ చేసుకునే కథ కావడంతో ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించింది.
దాని ప్లేస్ లో అదే బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ లో క్రిష్ దర్శకత్వంలో ఘాటి సినిమాకు ఓటేసింది. వేదం సినిమాలో వేశ్యగా అనుష్కలోని ఉత్తమ నటిని బయటికి తీసుకొచ్చిన క్రిష్ ను మరోసారి నమ్మింది. అమాయకంగా మొదలై గంజాయి వ్యాపారంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఓ పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ను అనుష్క ఈ సినిమాలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటూ మలయాళం లో కథనర్ అనే సినిమాతోనూ డెబ్యూచేస్తుంది. హర్రర్ టచ్ ఉన్న ఒక జానపద పాత్రను ఈ సినిమాలో అనుష్క చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. చూస్తుంటే అనుష్క ఫోకస్ మొత్తం తన క్యారెక్టర్ కు ఎంత గుర్తింపు దక్కుతుందనే దానిపై ఉన్నట్లు తెలుస్తోంది. భాగమతి2 తీయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కథ, సరైన డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచన మానుకుంది. ఇప్పుడు ఘాటి, కథనర్ రెండూ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలే. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలతో అనుష్క బిజీగా ఉంది.













