Dil Raju: దిల్ రాజు ఒత్తిడికి రేవంత్ రెడ్డి తలొగ్గారా..!?
తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య ఈ మధ్య గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం.. అందులో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు చావుబతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) అల్లు అర్జున్ ను అరెస్టు చేసింది. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు కేసు పెట్టారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ ను అరెస్టు (Allu Arjun Arrest) చేయడంపై ఇంటాబయటా అనేక విమర్శలు వచ్చాయి. అయితే చట్టప్రకారమే తాము వ్యవహరించాం తప్ప తనకు ప్రత్యేక కక్ష లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అల్లు అర్జున్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు (benefit shows) అనుమతి ఉండదని.. అలాగే టికెట్ రేట్లను (ticket rates) కూడా పెంచబోమని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy Venkat Reddy) కూడా ఇకపై టికెట్ రేట్లు పెంచాలంటా తమ వద్దకు రావద్దని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం టాలీవుడ్ (tollywood) పెద్దలను కంగారు పెట్టింది. దీంతో టాలీవుడ్ ప్రముఖులందరితో కలిపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించారు ఇటీవలే FDC ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు (Dil Raju). ఆ సమావేశంలో కూడా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఇకపై ఉండవని సీఎం క్లారిటీ ఇచ్చారు.
బెనిఫిట్ షోలు లేకపోవడం, టికెట్ రేట్లు పెంచబోమని చెప్పడం ముఖ్యంగా FDC ఛైర్మన్ దిల్ రాజుకు పెద్ద సమస్యగా మారింది. ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు గేమ్ ఛేంజర్ (game Changer), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki vasthunnam) రిలీజ్ అవుతున్నాయి. మరో సినిమా డాకూ మహరాజ్ (Daku Maharaj) సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలో దిల్ రాజుకు బాక్సాఫీస్ (box office) వద్ద కలెక్షన్లు కురిసే అవకాశం లేకుండా పోయింది. మరోవపు ఏపీ ప్రభుత్వం అడిగిన వెంటనే టికెట్ రేట్లు పెంచింది. కానీ తెలంగాణలో FDC ఛైర్మన్ గా ఉన్నా కూడా ఇవి సాధించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అయితే టికెట్ రేట్లు పెంచాలని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతానని దిల్ రాజు చెప్పారు.
దిల్ రాజు ప్రభుత్వాన్ని కోరినా రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే దిల్ రాజు ఒత్తిడికి రేవంత్ రెడ్డి తలొగ్గినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కూడా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బెనిఫిట షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయితే సినిమా రిలీజ్ రోజు మాత్రం ఐదు ఆటలు ఆడించుకునేందుకు అంగీకారం తెలిపింది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ విషయంలో రేవంత్ రెడ్డి మరీ పట్టింపులకు పోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. మంచిదే..!!













