Allu Arjun: అల్లు అర్జున్ విషయంలో రేవంత్ సర్కార్ శాంతించినట్లేనా..?
తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ 4 పుష్ప 2 (Pushpa 2) ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు గాయపడి ఆసుపత్రి పాలవడంతో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఏ11 నిందితుడిగా ఉన్నారు. కేసు విచారణలో భాగంగా డిసెంబర్ 11న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాత్రి జైలుకు తరలించారు. బెయిల్ పైన మరుసటి రోజు అల్లు అర్జున్ విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసేంది. ఇప్పుడాయన బెయిల్ పై బయట ఉన్నారు.
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. కానీ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వచ్చాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలంగాణ సీఎం పేరును అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని కూడా చెప్పుకొచ్చారు. అయితే తనకు ఎవరిమీదా కక్ష లేదని.. చట్టప్రకారమే వ్యవహరించామని రేవంత్ రెడ్డి అసంబ్లీలో వివరించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ కామెంట్స్ ను పోలీసులు (Telangana Police) సీరియస్ గా తీసుకున్నారు. అల్లు అర్జున్ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో విడుదల చేశారు. ఓ వైపు ప్రభుత్వం.. మరో వైపు అల్లు అర్జున్ పోటాపోటీగా ఈ వ్యవహారాన్ని రక్తి కట్టిస్తూ వచ్చారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇది ఎక్కడికో పోయేలా ఉందని కొందరు అనుమానించారు. అందుకే ఇటీవలే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించిన దిల్ రాజు (FDC Chairman Dil Raju).. సినీ పెద్దలందరినీ సీఎం రేవంత్ ముందు హాజరు పర్చారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ తమ తమ అభిప్రాయలను షేర్ చేసుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గినట్లు కనిపించింది.
ఆ మీటింగ్ ప్రభావం ఇవాళ కోర్టులో ప్రతిబింబించినట్లు అర్థమవుతోంది. అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టులో (Nampalli Court) హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన నేరుగా కాకుండా ఆన్ లైన్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ అంశంపై వాదనలకు కాస్త సమయం కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి. వాస్తవానికి అల్లు అర్జున్ బెయిలును వ్యతిరేకేందుకు పీపీ వద్ద అనేక ఆధారాలున్నాయి. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారు.. పోలీసులపై నిందలు వేశారు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. వీటి ద్వారా అల్లు అర్జున్ బెయిల్ (Bail) రద్దు చేయాలని.. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని వాదించి ఉండొచ్చు. కానీ పీపీ అలా చేయలేదు. కేసు వాయిదా కోరారు. దీన్ని బట్టి పోలీసులు/ ప్రభుత్వం అల్లు అర్జున్ వ్యవహారంలో కాస్త నెమ్మదిగా వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది.













