రివ్యూ : ఎన్టీఆర్ నట విశ్వరూపం ‘అరవింద సమేత వీర రాఘవ’

తెలుగుటైమ్స్ రేటింగ్ 3.5/5
బ్యానర్ : హారిక & హాసిని క్రియేషన్స్
నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, నరేష్, ఈషా రెబ్బా, సునీల్, నవీన్ చంద్ర, రావూ రమేష్, సుప్రియ పాఠక్, దేవయాని, సితార, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, రవి ప్రకాష్, శత్రు, సంతోష్ కుమార్ యాదవ్, రంగ రాయ్, మరియు శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ: పి యస్ వినోద్, ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం : తమన్ ఎస్, పాటలు: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, పెంచల్ దాస్
సమర్పణ: శ్రీమతి మమతా, సహ నిర్మాతలు : నాగ వంశి, పి డి వి ప్రసాద్
నిర్మాత : యస్. రాధా కృష్ణ (చినబాబు)
కథ, మాటలు, దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ: 11.10.2018
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు పుష్కర కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ కలిసి వర్క్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు వీరి కాంబినేషన్ లో అనుకున్న మూడు కథలకి అరవింద సమేత ఇరువురికి నచ్చిన కథ కావడంతో ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. అజ్ఞాతవాసి లాంటి ప్లాప్ తరువాత కూడా మాటల మాంత్రికుడి కథ నమ్మి అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడా..? త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్ తో టేకింగ్‌తో మునుపటి ముద్ర కొనసాగించాడా లేదా రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
‘అరవింద సమేత వీర రాఘవ’ రాయలసీమ లోని నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). పేకాట లో అయిదు రూపాయల కోసం వచ్చిన ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయి 30 ఏళ్ల పాటు పగలు పెంచుకుంటారు. 12 ఏళ‍్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు మాటుకాసి, దాడి చేసి నారప రెడ్డిని అతని మనుషులను చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. కాని తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో పరిచయం ఏర్పడుతుంది. ఫ్యాక్షనిస్టుల జీవన విధానం పై ఓ డాక్యుమెంటరీ చేయాలనీ ప్రయత్నిస్తుంటుంది. అరవిందను ఆమె తమ్ముడిని ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద చెప్పిన మాట సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:
ఎన్టీఆర్ సినిమా అంటేనే వన్ మెన్ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. ఎంతో మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్ ఓన్లీ వన్ గా అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా ప్రదర్శించి తన నట విశ్వరూపం చూపించాడు. టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో.. సిక్స్ ప్యాక్ తో పాటు చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఇక ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాలా.. కానీ గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో ఇంకా చాలా బాగా చేశాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో ఎన్టీఆర్ డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సినిమాలో కీలక పాత్ర అయిన ‘అరవింద’ పాత్రలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించింది. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. చాలా రోజుల తరువాత హీరో పక్కన ఫ్రెండ్ పాత్రలో సునీల్ తనదైన స్టయిల్లో ఆకట్టుకున్నాడు. అలాగే మరో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. ఇక జగపతి బాబు విషయానికొస్తే అత్యంత క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ గా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మరో ముఖ్య పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర కూడా తన నటనతో అకకట్టుకున్నాడు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన రావు రమేష్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ, దేవయాని, సుప్రియా పాతక్, సితార, రవి ప్రకాష్, శతృ తమ పాత్రల మేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఎవరూ టచ్ చెయ్యని థీమ్ తో త్రివిక్రమ్ రాసిన కథ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. త్రివిక్రమ్ ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ, రచనతో తన పనితనాన్ని చూపించాడు. అతను చెప్పిన మంచి పాయింట్ యుద్ధం జరిగిన తరువాత అటు గెలిచినవాడు ఇటు ఓడిపోయినవాడు ఇద్దరు సుఖంగా ఉండలేరు ఎందుకంటె ప్రతికార చర్యల వల్ల కోల్పోయిన జీవితాల్ని.. ఆ జీవితాల పై ఆధారపడ్డ నమ్ముకున్న బతుకుల బాధలను వారి బావోద్వేగాలను.. తలుచుకుంటూ మదనపడుతుంటాడు… అందుకే ముందుగా యుద్ధం అప్పడానికే ప్రయత్నించాలి అనే మంచి సందేశాన్ని ఈనాటి యువతరానికి ఇచ్చాడు. ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకున్నేలా చాలా చక్కగా చూపించారు.సంగీత దర్శకుడు యస్ తమన్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ‘పెనివిటీ’ పాట తమన్ కెరీర్ లో చెప్పుకోతగ్గ పాటగా నిలిచిపోతుంది.
త్రివిక్రమ్ స్క్రీన్ పై ఆ పాటను తెరకెక్కించిన విధంగా బాగా ఆకట్టుకుంటుంది. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ని ఇస్తాయి. పి.యస్ వినోద్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత యస్. రాధా కృష్ణ (చినబాబు) ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ఫ్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. అభిమానులు తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే డైలాగ్స్, ఎమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కథ పాతది కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్ కూడా తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా.. తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా ఈ సినిమాకు లవ్ స్టోరి అనవసరం అనిపిస్తుంది అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, టేకింగ్ అలరిస్తాయి. ద్వితీయార్థం ఎమోషనల్ సీన్స్‌తో భారంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి తిరిగి వేగం అందుకుని కథ పరిపూర్ణం అవుతుంది.
తీర్పు :
దర్శకుడు త్రివిక్రమ్ రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎవరూ టచ్ చెయ్యని థీమ్ బేస్ చేసుకొని రాసిన కథతో, బలమైన పాత్రలతో ఆకట్టుకున్నప్పటికి.. కొన్ని సన్నివేశాలను మాత్రం నెమ్మదిగా నడిపించారు. త్రివిక్రమ్ శైలి కామెడీ ఈ సినిమాలో లేకపోవడం.. లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం సినిమాని బలహీనపరుస్తాయి. అయితే ఎన్టీఆర్ తన నటనతో తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఈ దసరా కు ఎంత వరకు అలరిస్తుందో వేచి చూడాలి.