Chandrababu: బెనిఫిట్ షోలకు బాబు కూడా నో…?
తెలంగాణా తరహాలో సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. బెనిఫిట్ షోలను రద్దు చేయడం అలాగే టికెట్ ధరల పెంపు విషయంలో అనుమతి ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలను సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. ఏపీ విషయంలో సినిమా పరిశ్రమ ఎప్పుడూ సహాయ సహకారాలు అందించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా సినిమా వాళ్ళు రియాక్ట్ కాలేదు.
సినిమా పరిశ్రమ సంక్రాంతి సమయానికి భారీ సినిమాలను రిలీజ్ చేస్తోంది. తెలంగాణా షాక్ ఇవ్వడంతో ఏపీపై సినీ పెద్దలు చాలా ఆశలే పెట్టుకున్నారు. హైదరాబాద్లో సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి బయటకు రావడానికి… చంద్రబాబు సహకారం అందిస్తారని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే నంది అవార్డుల వంకతో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)ను కలవనున్నారు సినిమా పెద్దలు. దీనితో సీఎం బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తారా…? టికెట్స్ రేట్ పెంచుతారా అనే డైలామాలో చిత్ర పరిశ్రమ ఉంది.
అరెస్ట్ సమయంలో మనకు మద్దతు తెలపని సినీ పరిశ్రమ వాళ్ల గురించి మనం మాట్లాడుకోవటం అవసరమా అంటూ టీడీపీ సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. అప్పట్లో వైఎస్ జగన్ ఏ రేంజ్ లో వేదించినా ఆయనకు కొందరు సపోర్ట్ చేసారు. ఇక కేసీఆర్ అండ చూసుకుని ఏపీలో అడుగు పెట్టడానికి కూడా సినిమా వాళ్ళు అప్పట్లో అసలు ఇష్టపడలేదు. ఇప్పటికి కూడా ఏపీ రావడానికి ఆసక్తి చూపించడం లేదు సినిమా పెద్దలు.













