Minister Kandula :అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి : మంత్రి దుర్గేశ్

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అపాయింట్‌మెంట్ కావాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్‌లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు కలిశారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్ (Federation), ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వం జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తాం అని పేర్కొన్నారు.