అనురాగ్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన విక్రమ్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ కశ్యప్ కు దక్షిణాది సినిమాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఎంతో గౌరవముండటంతో వారి గురించి తరచూ చాలా గొప్పగా మాట్లాడుతుంటాడు. తన తాజా చిత్రం కెన్నడీని తమిళ నటుడు విక్రమ్ తో తీయాలనేది ఆయన ఉద్దేశమని, విక్రమ్ ని దృష్టిలో ఉంచుకునే కెన్నడీ స్టోరీని రాసుకున్నట్లు అనురాగ్ చెప్పాడు.
అయితే అనుకున్న ప్రకారమే ఈ కథను విక్రమ్ కు చెప్పానని, విక్రమ్ నుంచి రియాక్షన్ లేకపోవడంతో రాహుల్ భట్‌తో తీయాల్సి వచ్చిందని అనురాగ్ వెల్లడించిడం చర్చనీయాంశం అయింది. విక్రమ్ కనీసం ఎస్ ఆర్ నో కూడా చెప్పకపోవడమేంటనే సందేహాలు అందరికీ కలిగాయి. అనురాగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై విక్రమ్ స్పందించాడు. అనురాగ్ ఆరోపణలను విక్రమ్ సోషల్ మీడియా వేదికగా ఖండించాడు.
“డియర్ అనురాగ్ కశ్యప్, సోషల్ మీడియాలోని శ్రేయాభిషులాషుల కోసం ఏడాది ముందు మన మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ మూవీ కోసం నన్ను ఈమెయిల్, మెసేజ్‌ల రూపంలో సంప్రదించినప్పటికీ, నా నుంచి మీకు సమాధానం రాలేదని గతంలో మీరు ఒక నటుడితో చెప్పారు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే మీకు కాల్ చేశాను. మీరు మెసేజ్‌లు పంపిన మెయిల్ ఐడీ యాక్టివ్‌గా లేదని, నా మొబైల్ నంబర్ కూడా మార్చేశానని, అందుకే రీచ్ కాలేకపోయారని అప్పుడే మీకు చెప్పాను. కెన్నడీ కథ నాకు నచ్చిందని కూడా మీకు చెప్పాను కదా” అని విక్రమ్ ట్వీట్ చేశాడు.
అనంతరం అనురాగ్ స్పందిస్తూ, “నిజమే బాస్, ఓ నటుడి ద్వారా విషయం తెలుసుకున్న మీరు నన్ను సంప్రదించారు. అప్పుడే మాకు తెలిసింది మీ నంబర్ మారిందని. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు మాకిచ్చారు. మీరు స్క్రిప్ట్ చదవడానికి కూడా రెడీ అయ్యారు కానీ అప్పటికే మేం వేరే యాక్టర్ తో షూట్ కి షెడ్యూల్ రెడీ చేసుకున్నాం. మా సినిమాకు విక్రమ్ అసలు పేరైన కెన్నడీ అనే టైటిల్ పెట్టుకోవడానికి కూడా మీరు ఒప్పుకున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో నేను కెన్నడీ టైటిల్ వెనుక రీజన్ మాత్రమే చెప్పా. నా వ్యాఖ్యలను ఓవర్‌గా చూడకండి. నేను విక్రమ్ తో పని చేయకుండా అయితే రిటైర్ కాను” అని రిప్లై ఇచ్చాడు.













