ఫిలిం ఫేర్ అవార్డు వేలం!
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో దానిపై పోరుకు అన్నివర్గాల ప్రజలు సంసిద్ధమవుతున్నారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సెలబ్రిటీలు అంతా దేశవ్యాప్తంగా భారీగా విరాళాలు అందిస్తున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ లాక్మే ఫ్యాషన్ షోలో తను వేసుకున్న డ్రెస్‌ను వేలం వెయ్యాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మరో సెలబ్రిటీ తన ఫిలింఫేర్ అవార్డుని వేలానికి పెట్టారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈమేరకు ఒక ప్రకటన చేశారు. కోవిడ్-19 టెస్ట్ కిట్ల కోసం తన ఫిలిం ఫేర్ అవార్డును వేలం వెయ్యాలనుకుంటున్నారు. హాస్యనటులు కునాల్ కమ్రా, వరుణ్ గ్రోవర్ తమ యూట్యూబ్ బటన్లు, ట్రోఫీలను అనురాగ్ కశ్యప్‌తో పాటు వేలం వేయబోతున్నారు. ఈ వేలం ద్వారా రూ.13,44,000 సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ డబ్బుతో టెస్ట్ కిట్లు కొనుగోలు చేయబోతున్నారు. నిత్యా మీనన్, అనురాగ్ కశ్యప్‌లను ఆదర్శంగా తీసుకొని ఇంకెంత మంది సెలబ్రిటీలు బయటికి వస్తారో? ఏం వేలం వేయబోతున్నారో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.













