అనిరుధ్ మాత్రం ఏం చేస్తాడు?
స్టార్ హీరోల సినిమాల్లోని జీవం లేని ఎపిసోడ్లను సైతం తన రీరికార్డింగ్ తో ఎలివేట్ చేయగలడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. కానీ రీసెంట్ గా రిలీజైన ఇండియన్2 విషయంలో మాత్రం అనిరుధ్ విమర్శలకు గురవుతున్నాడు. కనీసం ఒక్క పాట కూడా బాలేదని, కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్2 లాంటి పాన్ ఇండియా సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేది ఇలానేనా అంటూ కమల్ ఫ్యాన్స్ అనిరుధ్ పై ఫైర్ అవుతున్నారు.
అయితే ఇలా అంటున్న వారంతా అనిరుధ్ పని చేసిన సినిమాల గురించి, ఆయన ఇచ్చిన మ్యూజిక్ గురించి, బీజీఎం గురించి ఒక్కసారి ఆలోచించాలి. సినిమాలో కనీస స్థాయిలో కంటెంట్ ఉంటే అనిరుధ్ తన నుంచి బెస్ట్ వర్క్ ఇచ్చి ఆ సీన్స్ ను ఎలివేట్ చేయగలడు. జైలర్ లో రజినీకాంత్ కారు దిగి వచ్చే సీన్ లో అనిరుధ్ ఇచ్చిన బీజీఎం ఒక్కటి చాలు తన వర్క్ గురించి చెప్పడానికి.
కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు కూడా అనిరుధ్ నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడన్న విషయం గుర్తు చేసుకోవాలి. తెలుగులో అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాల విషయంలో కూడా అనిరుధ్ తన ముద్ర వేయగలిగాడు. సెప్టెంబర్ లో దేవర రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారతీయుడు2 లాంటి అవుట్ డేటెడ్ సినిమాను కాపాడటం ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వల్లే కాదు. ఆ సినిమాకు రెహమాన్ వర్క్ చేసినా కానీ ఏ ప్రయోగం ఉండేది కాదు. ఏదేమైనా అనిరుధ్ సక్సెస్ఫుల్ జర్నీకి ఇండియన్2 ఫ్లాప్ తో కాస్త బ్రేక్ పడిందనే చెప్పాలి.













