గ్యాప్ లేకుండా ప్లాన్ చేసిన అనిల్
ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తో ప్రేక్షకుల్ని పలకరించిన విక్టరీ వెంకటేష్ ఆ సినిమాతో దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 76వ సినిమాను చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకీ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.
అనిల్ రావిపూడి ఈసారి వెంకీతో క్రైమ్ కామెడీ కథ చేయనున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ కు రెడీ అయింది. ఆగస్ట్ 9 నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను పోలాచ్చిలో ప్లాన్ చేశారట మేకర్స్.
ఈ షెడ్యూల్ చాలా లాంగ్ టైమ్ జరగనుందని, డైరెక్టర్ అనిల్ రావిపూడి షూటింగ్ కు ఎక్కువ బ్రేక్ పడకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో కుదిరినంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అనిల్ రావిపూడితో దిల్ రాజు తీసిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని దిల్ రాజు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.













