మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్న అనిల్
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినవే. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న అనిల్ నుంచి తర్వాత ఎలాంటి సినిమా రానుందని ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం భగవంత్ కేసరి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అనిల్, తన తర్వాతి సినిమా ఎవరితో చేయాలనేది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే భగవంత్ కేసరి కాంబోనే మళ్లీ చేస్తాడని వార్తలొచ్చాయి కానీ బాలయ్య ఇప్పటికే మరో రెండు సినిమాలు ఒప్పుకోవడంతో ఆ సినిమాలు పూర్తయ్యాక ఈ కాంబోలో మరో సినిమా వచ్చే ఛాన్సుంది.
తాజా సమాచారం ప్రకారం, అనిల్ తన తర్వాతి సినిమాగా ఓ మెగా మల్టీస్టారర్ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథ అనిల్ రెడీ చేశాడని, ఇద్దరు మెగా హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించాలని అనిల్ అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఎఫ్2, ఎఫ్3లాంటి మల్టీస్టారర్స్ చేసి మంచి హిట్స్ అందుకున్న అనిల్, మరోసారి మల్టీస్టారర్ మూవీకి రెడీ అవుతున్నాడని సమాచారం. మరి అనిల్ మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న ఆ ఇద్దరు మెగా హీరోలెవరో చూడాలి.













