జంతువులపై ఓ కొత్త చర్చకు శ్రీకారం చుట్టిన రష్మీ గౌతమ్
ప్రకృతి ప్రేమికులు కొందరుంటారు, మూగజీవాల ప్రేమికులు కొందరుంటారు. ఇద్దరూ సున్నిత మనస్కులై ఉంటారు. ముఖ్యంగా మూగ జీవాలను ప్రేమించేవారు వాటికి ఏదైనా హాని జరిగితే తట్టుకోలేరు. వాటిని హింసించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. జంతువులను సంరక్షించే ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాటికి డొనేట్ చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎన్ని సంస్థలు ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మూగజీవాలను హింసించేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్ చేసేవారూ ఉంటారు.
వారిలో మన టీవీ యాంకర్, నటి రష్మీగౌతమ్ ఎప్పుడూ ముందుంటుందనే చెప్పాలి. ఆమెకు మూగ జీవాలంటే ప్రాణం. వాటి సంరక్షణ చూస్తూ ఉంటుంది. లాక్డౌన్ సమయంలో మూగ జీవాల ఆకలిని తీర్చే వారే కరవైపోయిన సమయంలో వాటికి ఆహారం అందించి కాపాడింది. ముఖ్యంగా వీధి కుక్కల ఆకలి తీర్చింది. వాటిపై తనకు ఉన్న ప్రేమను తెలియజేస్తూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. జంతువులకు ఆమె చేస్తున్న సేవను నెటిజన్లు ప్రశంసిస్తుంటారు. ఆమధ్య కేరళలో ఏనుగును పైనాపిల్ బాంబుతో దారుణంగా చంపడం, కుక్కలపై మనుషులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించింది. మూగజీవాలపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మనుషుల మధ్య తాను ఉన్నందుకు సిగ్గు పడుతున్నానని చెప్పింది. మూగ జీవాలను ప్రేమించే మనసు మనుషులకు లేకపోవడం అనేది ఒక రోగం అనీ, ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటోంది రష్మీ. జంతువులను ప్రేమించే విషయంలో ఎవరైనా తన అభిప్రాయాలను వ్యతిరేకిస్తే సోషల్ మీడియా వేదికగానే వారికి ఆమె ధీటుగా కౌంటర్స్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
తాజాగా మరో పోస్ట్‌తో సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. కుక్కలను చంపితే జరిమానా కేవలం రూ.50లుగా ఉందని…ఈ చట్టాలని మార్చాలని డిమాండ్ చేసింది. జంతువులను హింసించేవారికి విధించే శిక్ష, జరిమానాలను పెంచాలని రష్మి డిమాండ్ చేస్తోంది. తన ట్వీట్‌ను మేనకా గాంధీతో పాటు పెటా ఇండియా, అనిమల్ ఎయిడ్, పీపుల్స్ ఫర్ అనిమల్ ఇండియా తదితర సంస్థలకు కూడా ట్యాగ్ చేసింది. రష్మీ గౌతమ్ ట్వీట్‌పై స్పందించిన కొందరు నెటిజన్స్…జంతువులను చంపేవారికి విధిస్తున్న జరిమానాను పెంచాలన్న డిమాండ్‌కు మద్ధతు పలికారు. నోరులేని జీవాలను చంపితే కేవలం రూ.50ల జరిమానాతో సరిపెట్టడం సరికాదంటున్నారు. జంతువులను హింసించేవారికి జరిమానా భారీగా ఉంటేనే జంతువులకు మనుషులు వాటికి హాని తలపెట్టకుండా ఉంటారని కొందరు నెటిజన్స్ రష్మీతో ఏకీభవించారు. ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి తప్ప…జరిమానా పెంచితే ఉపయోగం ఉండదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి జంతువులపై తనకు ఉన్న ప్రేమను తెలియజేస్తూనే ఓ కొత్త చర్చకు శ్రీకారం చుట్టింది రష్మీ. మరి ఈ విషయంలో పెటా ఇండియా, అనిమల్ ఎయిడ్, పీపుల్స్ ఫర్ అనిమల్ ఇండియా సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.













