అలా చేస్తే కాస్టింగ్ కౌచ్ మీ దరిదాపుల్లోకి కూడా రాదంటున్న అనసూయ
బుల్లితెరపై పరిచయమై తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకొని అడపా దడపా సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటోంది అనసూయ. ఇటీవలి కాలంలో క్షణం, సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, కథనం వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమధ్యకాలంలో నెపొటిజం మీద ఎంతో మంది సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన అనసూయ తను కూడా దాని బారినపడ్డానని, తనకు అవకాశాలు రాకుండా ఎంతో మంది అడ్డుకున్నారని తెలిపింది. తమలో టాలెంట్ ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పడానికి తన ఎదుగుదలే ఉదాహరణగా పేర్కొంటోంది. అయితే ఈ విషయాలను అప్పుడు బయటపెట్టలేదని, దానివల్ల తనకే నష్టం జరుగుతుందని తెలిపింది. ఇప్పుడైతే అలాంటి ఇబ్బందులు తనకు లేవని, తనకు సూట్ అయ్యే పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయని అంటోంది.
పనిలోపనిగా కాస్టింగ్ కౌచ్ గురించి కూడా తన అభిప్రాయాలను, అనుభవాలను వెల్లడించింది అనసూయ. తను ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఎంటర్ అయ్యానని, మొదట్లో అవకాశాలు రాలేదని చెప్పింది. అయితే కాస్టింగ్ కౌచ్ వంటి ఇబ్బందులు తనకు ఎదురుకాలేదని తెలిపింది. ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ వంటివి ఉండొచ్చు. కానీ, దాని బారిన పడకుండా ఉండాలంటే అది అమ్మాయిల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఆఫర్ ఇస్తారని అందర్నీ నమ్మడం, ఆ తర్వాత మోసపోవడం సరైంది కాదని, మనలో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా అవకాశాలు వస్తాయి, సక్సెస్ కూడా దాని వెంబడే వస్తుందని చెబుతోంది అనసూయ. ఫలానా క్యారెక్టర్ నువ్వు తప్ప మరొకరు చెయ్యలేరు అన్నంత పేరు తెచ్చుకోవాలని, అప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని అంటోంది. మనం అనుకున్నది సాధించడంలో కాన్ఫిడెంట్‌గా ఉంటే కాస్టింగ్ కౌచ్ వంటివి మన దరిదాపుల్లోకి కూడా రావని ధైర్యం చెబుతోంది. ప్రస్తుతం అనసూయ `రంగమార్తాండ` అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.













