దాక్షాయణి పగ మామూలుగా ఉండదట
మరో ఐదు నెలల్లో రిలీజ్ కానున్న పుష్ప2 కోసం యావత్ భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న పుష్ప2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. చిత్ర యూనిట్ ఇంకా ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు. ఎలాగైనా రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోవాలని బన్నీ, సుకుమార్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనసూయ చేస్తున్న దాక్షాయణి పాత్ర చాలా కీలకంగా ఉండనుందని యూనిట్ సభ్యులంటున్నారు. పుష్ప స్టోరీ ప్రకారం ఈమె పగకు రెండు కారణాలుంటాయి. వాటిలో ఒకటి తన తమ్ముడిని పుష్ప చంపడం, రెండోది పుష్ప వల్ల భర్తను గొంతు కోసి గాయం చేయడం. తన పగకు ప్రతీకారంగా అనసూయ, ఫాహద్ ఫాసిల్ తో చేతులు కలిపి ఎర్ర చందనం మాఫియాని తన చేతుల్లోకి తీసుకునే సన్నివేశాలను సుకుమార్ చాలా బాగా తీశాడని చెప్తున్నారు.
అనసూయపై తీసిన సీన్స్ అన్నీ ఎడిటింగ్ లో పోకుండా సినిమాలో ఉంటే మాత్రం పుష్ప2 తర్వాత అనసూయ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. సునీల్ పాత్రకు కూడా రెండో భాగంలో ప్రాధాన్యత పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం కీలక నటీనటులతో షూటింగ్ చేస్తున్న సుకుమార్, ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోగా సాంగ్స్ తో సహా షూటింగ్ పూర్తి చేస్తేనే పుష్ప2 రిలీజ్ ప్రశాంతంగా జరుగుతుంది. లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కు, ప్రమోషన్స్ కు టైమ్ సరిపోక ఇబ్బంది పడాల్సి వస్తుంది.













