ముదిరిన ‘మర్డర్’ వివాదం.. కోర్టుకెక్కిన అమృత.. ఆర్జీవీకి, నిర్మాతలకు నోటీసులు
డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మకు వివాదాలు కొత్త కాదు, కోర్టు కేసులు కూడా కొత్త కాదు. నేను దేనికైనా రెడీ అన్నట్టుగానే ఉండే వర్మకు ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. `మర్డర్` చిత్రానికి సంబంధించి వాస్తవానికి దూరంగా ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని, తన జీవితంలో జరగనివి జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అమృత కోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్‌ల ప్రేమ, ప్రణయ్ హత్య నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న `మర్డర్` చిత్రానికి సంబంధించి విడుదల చేసిన మొదటి పోస్టర్‌తోనే వివాదం మొదలైంది.
అనుమతి లేకుండా తమ కథను సినిమాగా తీస్తున్నారని ఆరోపించింది అమృత. అయితే ఇది యదార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమాయే తప్ప యదార్థ కథ కాదు అంటూ వర్మ చెబుతూ వస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా సినిమాలోని పాటను రిలీజ్ చేశారు. `పిల్లల్ని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా?` అంటూ సాగే పాటను సిరాశ్రీ రాయగా, రామ్‌గోపాల్‌వర్మ ఆలపించారు. యదార్థ ఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నానని చెప్పి తన జీవితాన్ని వక్రమార్గంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని వర్మపై మండిపడుతోంది అమృత. ఇక న్యాయపోరాటం తప్పదని గ్రహించిన అమృత కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది. అమృత వేసిన పిటిషన్‌ను ఎస్.సి., ఎస్.టి. కోర్టుకు బదిలీ చేశారు. అమృత వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. ఆగస్ట్ 6 `మర్డర్` సినిమా దర్శకుడు, నిర్మాతలు కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కరోనా నిబంధనల మేరకు ఈ మెయిల్, వాట్సాప్‌ల ద్వారా ఈ నోటీసులను పంపించింది న్యాయస్థానం.
ఇది అమృత, ప్రణయ్‌ల కథ కానే కాదని, ఇది పూర్తి కుటుంబ కథా చిత్రమని మొదటి నుంచీ వర్మ చెబుతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్లో మాత్రం ప్రణయ్ హత్య సమయంలో టీవీలో కనిపించిన విజువల్స్‌నే మళ్లీ తీసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఒక సినిమా ట్రైలర్ చూస్తున్న భావన కలగదు. అందుకే అమృత తీవ్రంగా కలత చెంది కోర్టును ఆశ్రయించింది. నోటీసులు అందుకున్న రామ్‌గోపాల్‌వర్మ, నిర్మాతలు ఎలా స్పందిస్తారో, కోర్టుకు వెళ్లి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.













