ప్రభాస్ సినిమా కోసం అమితాబ్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్‌కి షాక్ అయిన యూనిట్
సినిమా రంగంలో నటీనటుల పారితోషికాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అది ఆ నటీనటుల రేంజ్‌ని బట్టి కావచ్చు లేదా చేయబోయే సినిమాకి ఉన్న స్పాన్‌ని బట్టి కావచ్చు ఒకేసారి తమ రెమ్యునరేషన్‌ని పెంచేస్తారు. ఇప్పుడు అమితాబ్ అదే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్ తను చేసే ప్రతి సినిమానూ ప్యాన్ ఇండియా మూవీగా మలుస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే బాహుబలి తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సాహో తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది. మరి అంత బడ్జెట్‌తో సినిమా చేస్తున్నారంటే అందులో నటించే నటీనటులకు కూడా భారీగానే ముట్టచెబుతారు కదా. ఆ సినిమా తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్‌తోనే ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత నాగ్అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్‌లో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. అదేమిటంటే బిగ్ బి అమితాబ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని. ఇంతకుముందు చిరంజీవి హీరోగా నటించిన సైరాలో నటించిన అమితాబ్ ఇప్పుడు రెండో సినిమాని కూడా ఓకే చేశాడట. అయితే ఈ సినిమా ఒప్పుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. అదే రెమ్యునరేషన్. ఈ సినిమా చేసేందుకు అమితాబ్ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అయినా అంత మొత్తాన్ని చెల్లించేందుకు నిర్మాత సిద్ధపడి అమితాబ్‌ను తమ సినిమాలో ఓకే చేసుకున్నారు.
సైరాలో నటించినందుకు అమితాబ్‌కి ఎంత పారితోషికం ఇచ్చారో తెలీదుగానీ ఈ సినిమాకి మాత్రం ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. సాధారణంగా ఇప్పుడు ఆయన వయసు రీత్యా చేసే పాత్రల కోసం బాలీవుడ్లో 5 కోట్ల వరకు ఒక సినిమాకి తీసుకునే అమితాబ్… ప్రభాస్ సినిమాలో నటించేందుకు ఒక్కసారిగా తన రెమ్యునరేషన్‌ని డబుల్ ఎందుకు చేశాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదట. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు అమితాబ్ లాంటి ఆర్టిస్టు ఈ సినిమాకి ఏ విధంగా ప్లస్ కాబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది.













