మంగళవారంకు బన్నీ స్టాంప్
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న సినిమా మంగళవారం. ఈ సినిమాను స్వాతిరెడ్డి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి రెడ్డి ఈ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో స్వాతి రెడ్డి మీడియాతో ముచ్చటించింది.
సినీ నిర్మాణంలోకి తానేమీ లేటుగా రాలేదని, చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేదని చెప్పింది. మా టీవీలో ఉన్నప్పుడే సినిమా నిర్మించాలనుకున్నట్లు అది ఇన్నాళ్లకు సాధ్యమైందని ఆమె తెలిపింది. సినిమా తీయాలనుకుంటున్న టైమ్ లో ఈ స్టోరీ తన దగ్గరకు వచ్చినట్లు ఆమె వెల్లడించింది. ఈ సినిమా కథను బన్నీ విన్నాడని, మంచి స్క్రిప్ట్ అని స్టాంప్ వేశాడని చెప్పింది.
మా టీవీ కంటే ముందునుంచే బన్నీ తనకు మంచి ఫ్రెండ్ అని, తమ ఇద్దరి కుటుంబాల మధ్య మంచి బాండింగ్ ఉందని, అలా తమ మధ్య కూడా ఫ్రెండ్షిప్ కుదిరిందని స్వాతి రెడ్డి చెప్పింది. ఇక సినిమా గురించి చెప్తూ అజయ్ భూపతి నెరేషన్ విని ఈ సినిమా చేస్తే బాగుండనిపించి, ఈ సినిమా చేశానని, ఈ సినిమాలో మెసేజ్, మ్యూజిక్, ఎమోషన్ అన్నీ ఉన్నాయని స్వాతి రెడ్డి తెలిపింది.













