చార్టర్డ్ ఫ్లైట్లో ఉదయపూర్ చేరుకున్న అల్లు బ్రదర్స్
మెగా డాటర్ నిహారిక మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. దీంతో మెగా ఫ్యామిలీ చుట్టాలంతా ఉదయ్ పూర్ చేరుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కుటుంబంతో సహా ఉదయ్ పూర్ చేరుకున్నాడు. బన్నీ తండ్రి, ప్రముఖ సినిమా నిర్మాత అల్లు అరవింద్, తల్లి, భార్య, పిల్లలు ఇలా అల్లు కుటుంబ సభ్యులంతా కలిసి ఓ చార్టర్డ్ ఫ్లైట్లో ఉదయ్ పూర్ బయలు దేరారు. గుంటూరు ఐజీ ప్రభాకర రావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయం అయింది. ఈ నెల 9వ తేదీన పెళ్లి జరగనుంది. ఉదయ్ పూర్లోని ఉదయ్ విలాస్ హోటల్ వీరి వివాహానికి వేదికగా మారబోతోంది. ఇప్పటికే దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడకు చేరుకుంది.
ఈ క్రమంలో నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు.. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అన్నయ్య చిరంజీవి, వదినతో కలిసి నిహారిక వద్ద నిలబడి ఉన్న ఓ ఫొటోను ఆయన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే.. `ఓ కుటుంబంగా నీకు బలమైన కుటుంబాన్ని అందించాం. ఓ తండ్రిగా నీకు ఎగరడానికి రెక్కలు ఇచ్చా. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని భావిస్తున్నా. ఈ కుటుంబం నిన్ను ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతుంది. నిన్ను ప్రేమించే తండ్రిగా నేను ఇవ్వగలిగే రెండు అద్భుతమైన బహుమతులివే. లవ్యూ నిహారిక` అని నాగబాబు ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
నిహారిక పెళ్లికి సినీ పెద్దలా చాలా మంది వెళ్లబోతున్నట్లు సమాచారం. సీనియర్ డైరెక్టర్ల నుంచి యువ హీరోల వరకూ ఈ పెళ్లిలో కనిపించ బోతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు ఓ పిల్లర్ వంటి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక కావడంతో ఆ మాత్రం హడావుడి తప్పదు కదా అని మెగా అభిమానులు అంటున్నారు.













