తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికైన తొలి నటుడు అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకోబోతున్న తొలి నటుడు అల్లు అర్జున్ . తెలుగు సినీ పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు అల్లు అర్జున్ కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అందుకే, ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ గురువారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గానూ జూనియర్ ఎన్టీఆర్‌కు వస్తుందిన ఆయన అభిమానులు ఆశపడ్డారు.
కానీ, ‘పుష్ప’ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు అవార్డు దక్కింది. అయితే, అల్లు అర్జున్‌కు అభినందనలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరం. ‘అభినందనలు అల్లు అర్జున్ బావ. పుష్ప సినిమా విజయానికి, ఆ చిత్రానికి నువ్వు గెలుచుకున్న అవార్డులకు నువ్వు పూర్తిగా అర్హుడివి’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు. ‘నిజాయతీగా నువ్వు చెప్పిన అభినందనలకు థాంక్యూ సో మచ్ బావ. నీ అభినందనలు నా మనసును హత్తుకున్నాయి’ అని అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చారు.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ట్విట్టర్ ద్వారా జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులను కట్టిపడేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు బన్నీకి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే, బన్నీ అభిమానులు ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్, బన్నీ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే, అల్లు అర్జున్‌తో పాటు జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్న మరికొంత మందికి సైతం జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. తన ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసి జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్న ఎం.ఎం.కీరవాణి, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్, శ్రీనివాస మోహన్, కింగ్ సాలమన్లకు ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు.













