లాక్ డౌన్… ఆహా లక్ అప్…
ఇల్లే కదా సినీ సీమ అనుకుంటున్నారు జనం. లాక్ డౌన్ దెబ్బకు సినీ ప్రేక్షకులకు ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా కనెక్టయిపోయాయి. ధియేటర్లు తప్ప మరో రకంగా సినిమా చూడడం తెలియని ప్రేక్షకులు సైతం అమెజాన్, నెట్ ఫ్లిక్స్…వగైరాలకు ఆదరాబాదరా సబ్స్క్రైబర్లయిపోతున్నారు. అక్కడ నుంచి కనీసం రోజుకో సినిమా చూడడం అనేది సర్వసాధారణమైపోయింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఒటీటీ వేదికలు పెద్ద సంఖ్యలో కొత్త, పాత సినిమాలను కొనుగోలు చేసి మరీ అందిస్తున్నాయి. ఈ స్పీడ్‌లో గత కొంత కాలంగా పడుతూ లేస్తూ ఉన్న కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
వీటిలో సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ఆహా ఒకటి. అచ్చతెలుగు యాప్‌గా రంగంలోకి వచ్చిన ఈ ఒటీటీ కొత్త పోరడ వంటి వెబ్‌సిరీస్ ల ద్వారా కొంత వరకూ ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ.. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేంతగా సినిమాల బ్యాంక్ లేకపోవడంతో పెద్దగా పుంజుకోలేకపోయింది. గీతా ఆర్ట్స్ సినిమాలు మినహా పెద్దగా మూవీ కంటెంట్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో టాప్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మిగిలిన యాప్స్ తో ఆహా పోటీపడలేదని తేల్చేశారు. అయితే లాక్‌డవున్ ఆహా లక్‌ని మార్చేసింది. లాక్ డవున్ తో అన్ని ఒటీటీలతో పాటు కాస్త పుంజుకున్న ఆహా ను ఇటీవల విడుదలైన “భానుమతి రామకృష్ణ” సినిమా ఊపందుకునేలా చేసింది. ఈ సినిమా మంచి పేరు తెచ్చుకోవడంతో ఈ యాప్‌కు సబ్స్క్రైబర్లు బాగా పెరిగారు. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్‌లో మంచి హిట్టయిన “కృష్ణ అండ్ హిజ్ లీల”ను ఆహా కూడా అందిస్తుండడం కూడా ఆహా రాతను మార్చింది. నెట్‌ఫ్లిక్స్ కన్నా ఆహా సబ్స్క్రిప్షన్ చౌక కావడంతో ఈ సినిమాను చాలా మంది ఆహాలో చూస్తున్నారు. ఏదేమైనా… లాక్ డవున్‌లో ఆహా లక్ తిరిగింది. అయితే పోటీ బాగా ఉన్న పరిస్థితిలో ఈ క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే ఆహా నిర్వాహకులు మరింత శ్రమించాల్సిందే.













