కూతురు పుట్టాక ట్రెండీ లుక్ తో అదరగొడ్తున్న ఆలియా..
ఆలియా భట్ ప్రస్తుతం మాతృత్వంలోని మధురిమని ఆస్వాదిస్తున్నారు. మాతృత్వం అనేది ఒక అందమైన అనుభూతి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్, సెలెబ్రేటిస్ తమ బేబి బంప్ ఫోటోషూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రీసెంట్ గా ఆలియా భట్ కూడా తన బేబి బంప్ ఫోటోలతో ఇంటర్నెట్ లో దర్శనమిచ్చింది.
ఆలియా భట్, రణవీర్ కపూర్ దంపతులు రీసెంట్ గా ఒక అందమైన కుమార్తెకి తమ జీవితాల్లోకి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రిస్మస్ వేడుకలను రణవీర్-ఆలియా జంట తమ కుమార్తెతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలియా సోషల్ మీడియాలోని తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసారు. శుక్రవారం రాత్రి భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలో జరిగిన అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ఎంగేజ్ మెంట్ పార్టీకి హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో ఆలియా తన అభిమానుల కోసం ఒక ఫోటోని షేర్ చేసింది. రితికా మిర్చందానీ డిజైనర్ నుండి ఆక్వా బ్లూ కుర్తా ధరించి ఆలియా భట్ ఈ పార్టీకి హాజరయ్యారు. అలియా భట్ తన పోస్ట్ కి స్నోఫ్లేక్ ఎమోజిని జోడించింది. ఈవెంట్ కోసం తన మేకప్ ను సందర్భానుసారం మినిమల్ గా తీర్చిదిద్దింది. రీసెంట్ గా ఇంస్టా లో జరిగిన చర్చల్లో పోస్ట్ డెలివరీ కష్టాలు, శరీరంలోని మారుపుల గురించి ఆలియా మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇందులో ఒక పోస్ట్ సారాంశం ఇలా ఉంది. “ఈ సంవత్సరం నా రూపం ఎలా మారుతుందో కానీ, నేను మళ్ళీ నా పాత రూపం గురించి ఎప్పుడూ కష్టపడకూడదని ప్రతిజ్ఞ చేసాను” అని తెలిపింది. తన భర్త రణబీర్ కపూర్ తో ఈ సంవత్సరం క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఫోటోలను కూడా ఈ అమ్మడు షేర్ చేసింది. ఈ సంవత్సరంలో అత్యుత్తమ సమయం .. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తులతో.. గడిపాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అందరికీ మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
అలియా భట్ కి 2022 వృత్తిపరంగా అద్భుతమైన సంవత్సరం. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత అలియా హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నాయికగా ఓ వెలుగు వెలుగుతోంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సానుకూల సమీక్షలను అందుకున్న డార్లింగ్స్ కి సహనిర్మాతగా కొనసాగింది.













