రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ హీరోనని మరోసారి ప్రూవ్ చేసుకున్న అక్షయ్
ఆదాయం, ఆస్తులు పెరుగుతున్న కొద్దీ డబ్బుపై వ్యామోహం, ఆశ పెరుగుతుందని అందరూ అంటుంటారు. అది అక్షరాలా నిజం అని కొంతమంది విషయంలో రుజువైంది. సినీ ప్రముఖుల విషయాన్నే తీసుకుంటే వందల, వేల కోట్ల ఆస్తులు ఉన్న సినీ ప్రముఖులు భారతదేశం అంతటా ఉన్నారు. కానీ, కొందరిలో మాత్రమే దాన గుణం ఉంటుంది, ఆపదలో ఉన్న ఎదుటివారిని ఆదుకునే మనస్తత్వం ఉంటుంది. దేశంలో ఏదైనా విపత్తు సంభవించినపుడు మాత్రమే వారు బయటికి వస్తారు. కొంతమంది గుప్తదాతలు కూడా ఉంటారు. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితికి ప్రతి ఒక్కరూ స్పందించారు. తమ స్టేటస్‌కి తగ్గట్టు విరాళాలు అందించారు. వారిలో ప్రముఖంగా బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ గురించి చెప్పుకోవాలి.
ఏ ఆపద వచ్చినా మొదట స్పందించేది అతనే. అక్షయ్ ఆదాయం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగానే దానాలు కూడా చేస్తాడు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రారంభంలోనే ప్రధాన మంత్రి సహాయ నిధికి 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. ఆ తర్వాత ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులతో పాటు.. ముంబాయి పోలీస్ అసోసియేషన్‌కు మరో రూ. 5 కోట్ల విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన ధాతృత్వాన్ని ప్రకటించుకున్నాడు అక్షయ్. బీహార్, అస్సాం రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారి సహాయార్థం రెండు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలను అక్షయ్ విరాళంగా అందించాడు. గతంలో కూడా ఒరిస్సాతో పాటు పలు ఘటనల్లో కన్నుమూసిన పోలీసుల జవానులకు తన వంతు సాయం ప్రకటించారు. అక్షయ్ విరాళం అందించిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనేవాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తాను హీరోనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అక్షయ్.













