ఫోర్బస్ 2020 జాబితాలో అక్షయ్ కుమార్
ప్రముఖ హిందీ నటుడు అక్షయ్ కుమార్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే సినీ నటుల్లో ఒకరుగా మరోసారి ఫోర్బస్ 2020 జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఫోర్బస్ మేగజీన్ కథనం ప్రకారం అత్యధిక పారితోషికం పొందే తొలి 10 మంది నటుల్లో అయ్ది ఆరో స్థానం. గత ఏడాది నాలుగో స్థానంలో నిలిచిన ఆయన ఈ సారి రెండు స్థానాలు దిగువకు రావటం గమనార్హం. 2019 జూన్ 1 నుంచి 2020 జూన్ ఒకటవ తేదీ వరకు ఆదాయ ఆర్జనలను పరిగణనలోకి తీసుకొని తాజా జాబితా రూపొందించారు. ఈ సమయంలో అక్షయ్ సంపాదన సుమారు రూ.362.82 కోట్లు(48.5 మిలియన్ డాలర్లు)గా అంచనా వేశారు. హాలీవుడ్ నటుడు డ్వైన్ జాన్సన్ రూ.654.60 కోట్ల(87.5 మిలియన్ డాలర్ల)తో వరుసగా రెండో ఏడాదీ ప్రథమ స్థానంలో నిలిచారు.













