వ్యూస్ అదిరిపోయాయి.. టాక్ అంతంత మాత్రం.. టెన్షన్లో అక్షయ్, లారెన్స్?
గ్రూప్ డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సౌత్‌లో హీరోగా, డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఫస్ట్ టైమ్ హిందీలో డైరెక్ట్ చేసిన లక్ష్మీబాంబ్ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. తమిళ్, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన కాంచన రీమేక్‌గా హిందీలో రీమేక్ అయిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించాడు. ముని సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలూ సౌత్‌లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ తరహా సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తే అని చెప్పాలి. అందుకే ఈ క్యారెక్టర్ చెయ్యడానికి అక్షయ్‌కుమార్ ఒప్పుకున్నాడు. లక్ష్మీబాంబ్ సినిమా ఎలా ఉండబోతోందని ఎదురుచూసిన సౌత్ ప్రేక్షకుల్ని ట్రైలర్ నిరాశపరిచిందని చెప్పాలి. నార్త్‌లో ఈ ట్రైలర్‌కి ఎలాంటి స్పందన వస్తోందో తెలీదుగానీ సౌత్ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాకి సూట్ అవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆల్రెడీ ఈ సినిమాను పలుమార్లు చూసి ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ట్రైలర్‌కి ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
ఈమధ్యకాలంలో ఫ్లాప్ అనేది ఎరుగని అక్షయ్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని అతని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్‌కి కూడా ఈ సినిమా కీలకమనే చెప్పాలి. పాతికేళ్ళ అతని కెరీర్లో ఇప్పటివరకు ఒక్క హిందీ సినిమా కూడా చేయకపోవడం విశేషమనే చెప్పాలి. ప్రభుదేవా, రాజుసుందరం వంటి డాన్స్మాస్టర్లు హిందీతోపాటు చాలా భాషల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. కానీ, లారెన్స్ మాత్రం తమిళ్, తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాడు. అయితే ఒకటి రెండు కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఫస్ట్‌టైమ్ హిందీలో చేసిన ఈ సినిమాపై లారెన్స్ కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వ్యూస్ పరంగా బాగానే అనిపించినా టాక్ మాత్రం లారెన్స్‌ని టెన్షన్ పెట్టేలా ఉంది. నవంబర్ 6న ఓటీటీ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా అక్షయ్‌కుమార్‌కి, లారెన్స్‌కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













