హీరోగా ఐదేళ్ళ కెరీర్.. మూడు భారీ సినిమాలు.. ఇంకా బ్రేక్ కోసం వెయిటింగ్!
తండ్రి హీరో అయినంత మాత్రాన కొడుకు కూడా హీరో అవ్వాలని లేదు. ఒకవేళ హీరో అయినా సక్సెస్ అవ్వాలని లేదు. తండ్రి అందం, టాలెంట్ కొడుకులోనూ ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఇది చాలా మంది హీరోల విషయంలో ప్రూవ్ అయింది. అందం, టాలెంట్ ఉంటే సరిపోదు, కాలం కలిసి రావాలి. అదృష్టం తలుపు తట్టాలి. ఇవన్నీ దాటుకొని వస్తేనే హీరోగా ప్రేక్షకులు ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇప్పుడున్న టాప్ హీరోలంతా ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎదిగినవారే. కానీ, వారి వారసులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తండ్రి పేరుతో హీరోలుగా చలామణి అయిపోవాలని ఆశపడుతుంటారు. అలా కూడా కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు ఫ్లాప్ అయ్యారు.
టాలీవుడ్లో ఉన్న ఇంత మంది హీరోల్లో నాగార్జుననే తీసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అనే ఒకే ఒక్క కారణం తప్ప అతను హీరో అవ్వడానికి ఎలాంటి లక్షణాలు అప్పట్లో లేవు. మొదటి సినిమా విక్రమ్‌లో నాగార్జున నటన చూస్తే బహుశా నాగార్జునకు కూడా ఇప్పుడు నచ్చదేమో. అలాంటి ఆ తర్వాత నిలదొక్కుకొని అన్ని రకాల క్యారెక్టర్స్ చేసి మాస్ ఆడియన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరి మన్ననలు పొందాడు. అంతేకాదు, తండ్రిలాగే భక్తుడి వేషాలు కూడా వేసి తనలో దాగివున్న నటుడ్ని బయటకు తీసుకొచ్చాడు. ఎఎన్నార్ హీరో అయినంత మాత్రాన నాగార్జునకు అవకాశాలు వచ్చెయ్యలేదు. తన కృషి పట్టుదలతోనే అన్నీ నేర్చుకొని టాప్ హీరో అనిపించుకున్నాడు.
ఇక నాగార్జున కొడుకు నాగచైతన్య 2009లో జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతని లక్ కొద్దీ రెండో సినిమానే గౌతమ్ మీనన్‌తో చేశాడు. ఏమాయ చేసావె సూపర్‌హిట్ అవ్వడంతో అతని టాలెంట్‌కి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఇక నాగార్జున రెండో కొడుకు అఖిల్ చిన్నతనంలోనే సిసింద్రీ అనే సినిమా చేసి తెరంగేట్రం చేశాడు. పెద్దయిన తర్వాత మనం సినిమాలో కాసేపు తళుక్కున మెరిసిన అఖిల్… వినాయక్ డైరెక్షన్లో రూపొందిన అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా భారీ కథాంశంతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అఖిల్ వయసుకు మించిన సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా అఖిల్ చేయడం ప్రేక్షకులకు రుచించలేదు. యాక్షన్ సినిమాను కాదని ఆ తర్వాత హలో అంటూ ఓ లవ్‌స్టోరీ చేశాడు. అదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను అంటూ మరో సినిమా చేశాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు. ఏ జోనర్లో చేసినా అదే రిజల్ట్ రావడం అఖిల్‌ను కలవరపెడుతోంది. ఇప్పుడు బొమ్మరిల్లు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన భాస్కర్ డైరెక్షన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు. అటు అఖిల్‌కి హిట్స్‌లేవు, ఇటు భాస్కర్‌కీ ఈమధ్యకాలంలో హిట్స్ లేవు. మరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా వారికి ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
తాజాగా సురేందర్‌రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మించే ఈ సినిమా అఖిల్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని అందరూ భావిస్తున్నారు. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్స్ ఉన్నాయి. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, రవితేజ, కల్యాణ్‌రామ్ వంటి హీరోలతో బ్లాక్‌బస్టర్స్ తీశాడు. అఖిల్ కోసం ఒక అద్భుతమైన కథ సిద్ధం చేశాడని, తప్పకుండా ఈ సినిమా హీరోగా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.













