పెద్ద హీరోల సినిమాలతో అఖిల్ అంత రిస్క్ చేయడం అవసరమా?
`మనం`లో తళుక్కున మెరిసి `అఖిల్` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని తొలి చిత్రంతోనే పరాజయాన్ని చవి చూశాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా అతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భాస్కర్‌కి కూడా ఈమధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడంతో డైరెక్టర్ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫలితం అతనికి కూడా కీలకంగా మారింది. అయినా అఖిల్‌కి మంచి హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా ఎలా ఉందో చూడాలని నాగార్జున రఫ్ ఎడిటింగ్‌లో ఉన్న సినిమా మొత్తాన్ని చూశాడట నాగార్జున. సినిమా ఔట్పుట్ పట్ల నాగార్జున సంతోషం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో అఖిల్ సరనన పూజా హెగ్డే నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వారిద్దరూ పాల్గొన్న రొమాంటిక్ సీన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బాగా డీల్ చేసే భాస్కర్ ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్‌ని తెరకెక్కించాడట. అలాగే చక్కని ప్రేమకథని కూడా యూత్‌ని ఆకట్టుకునేలా తీశాడట. లాక్డౌన్ కారణంగా కొంత బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది యూనిట్. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతి పండగ అంటేనే పెద్ద హీరోల సినిమా పండగ అని అందరికీ తెలిసిందే. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు చాలా రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. వాటిలో వకీల్ సాబ్, నారప్ప, క్రాక్, లవ్ స్టోరీ, కెజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాల పేర్లు వినిపిస్తున్నాయి. మరి అంత పెద్ద హీరోల సినిమాల ముందు అఖిల్ సినిమా నిలబడి తట్టుకోగలదా అనేది అందరిలోనూ ఉన్న సందేహం. హీరోతోపాటు దర్శకుడు కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్న నేపథ్యంలో సంక్రాంతికి రిలీజ్ చేస్తే పెద్ద రిస్క్ చేసినట్టే అవుతుంది. అఖిల్ మాత్రం సంక్రాంతికే తన సినిమా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. అప్పటివరకు కరోనా ఉధృతి తగ్గి థియేటర్స్ యధాస్థితికి వస్తాయన్న నమ్మకంతోనే ఉన్నారు చాలా మంది దర్శకనిర్మాతలు. మరి అఖిల్ సినిమాని పెద్ద సినిమాలతోపాటుగానే రిలీజ్ చే్స్తారా? మరో డేట్ గురించి ఆలోచిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.













