దృశ్యం 3 తెలుగు ఇప్పట్లో లేనట్లే..
ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని కనిపెట్టిన సినిమా దృశ్యం. ఈ సినిమాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరో నిజాలను మాయం చేస్తూ, అందరినీ పక్క దోవ పట్టించి తన ఫ్యామిలీని సేవ్ చేసుకునే నేపథ్యంలో జీతూ జోసెఫ్ రాసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంది. ఈ ట్రెండ్ కు అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ కూడా లభించింది.
దృశ్యం-1 సినిమాతో కేరళలో అప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి మోహన్ లాల్ కు తిరిగి నెంబర్ వన్ ప్లేస్ ను కట్టబెట్టిన ఈ మూవీ, తెలుగులో వెంకటేష్ కు కూడా మంచి సక్సస్ ను ఇచ్చింది. హిందీలో అజయ్ దేవగన్‌కు కూడా ఈ సినిమా మంచి హిట్ ను ఇచ్చింది. తర్వాత వచ్చిన దృశ్యం2 తెలుగు, మలయాళం వెర్షన్లు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవడం వల్ల అది బాక్సాఫీస్ పరంగా ఎంతటి హిట్ అనేది చెప్పలేకపోయారు.
కానీ హిందీ దృశ్యం2 మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేసుకుని మంచి లభాలను అందుకుంది. గతేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది దృశ్యం2. ఇప్పుడు దృశ్యం3కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి అన్ని భాషల్లోనూ ఒకేసారి షూట్ చేసి రిలీజ్ చేయాలనుకున్నాడు జీతూ జోసెఫ్. వాటితో తెలుగు మాత్రం ఉండదని టాక్.
వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. క్రమం తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుగుతూనే ఉంది. నవాజుద్దీన్ సిద్దికీ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా దీపావళి లోగా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. దీని కోసమే వెంకీ గడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు. దృశ్యం సిరీస్ కు ఈ లుక్ పనికిరాదు కాబట్టి ప్రస్తుతానికి అయితే దృశ్యం3 సినిమా లేనట్లే అంటున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ సన్నిహతులు.













