Sodara Sodarimanulara!: ‘ఆహా’ ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ
సోషల్ డ్రామా – థ్రిల్లర్ జానర్లో రూపొందిన ‘సోదర సోదరిమానులారా..!’ చిత్రం తాజాగా ‘ఆహా’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకుంటోంది. దర్శకుడు రఘుపతి రెడ్డి గుండా తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, పృథిరీరాజ్, అపర్ణ, కలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఒక సాధారణ మనిషి జీవితం ఒక్క సంఘటనతో ఎలా పూర్తిగా తలకిందులవుతుందో గాఢంగా ఆవిష్కరిస్తుంది.
కథ ఒక క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. భార్య, ఆరు సంవత్సరాల కూతురితో సంతోషంగా జీవిస్తున్న అతని జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన మలుపు అతడిని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. ఒక అత్యాచారం, హత్య కేసులో అతడిని తప్పుగా నిందితుడిగా నిలబెట్టి శిక్ష విధించడంతో అతని గౌరవం, స్వేచ్ఛ, కుటుంబ జీవితం అన్నీ ఛిద్రమవుతాయి.
ఈ నేపథ్యంలో నిజాన్ని నిరూపించుకునేందుకు అతడు చేసే పోరాటం, అలాగే భర్త నిర్దోషిత్వాన్ని నిలబెట్టేందుకు అతని భార్య వ్యవస్థతో, సమాజపు ముద్రలతో చేసే ధైర్యమైన పోరాటం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. ఒక మహిళ తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక సంఘర్షణను దర్శకుడు హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు.
కమల్ కామరాజు, పృథిరీరాజ్, అపర్ణ, కలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించి తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘సోదర సోదరిమానులారా..!’ కేవలం ఒక క్రైమ్ కథ మాత్రమే కాదు. న్యాయవ్యవస్థలోని లోపాలు, నిజం తెలుసుకోకుండానే నిర్దోషులను దోషులుగా ముద్ర వేసే సమాజ ధోరణిపై దర్శకుడు గట్టి ప్రశ్నలు సంధించారు. బలమైన కథనం, ప్రభావవంతమైన నటనలతో ఈ చిత్రం సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చే అర్థవంతమైన చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతోంది.






