‘పెంగ్విన్’ దారిలోనే కీర్తి సురేష్ నటించిన మరో సినిమా?
లాక్డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ అస్తవ్యస్తంగా తయారైన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు షూటింగులు ఆగిపోయాయి. ఎట్టకేలకు షూటింగులకు అనుమతి వచ్చినా కొన్ని పెద్ద సినిమాలు షూటింగులు జరగడం లేదు. స్టార్ హీరోలు ఇప్పట్లో షూటింగులు చెయ్యం అని ఖరాఖండీగా చెప్పేస్తున్న ఈ నేపథ్యంలో కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పట్లో సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఓపెన్ చేసినా కలెక్షన్లు లేక మళ్లీ మూసెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దుబాయ్, చైనా వంటి దేశాల్లో థియేటర్లు ఓపెన్ చేసిన ఆడియన్స్ లేక వెలవెలబోవడంతో మళ్లీ మూసేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కరోనా పూర్తిగా అంతరించిన తర్వాత కూడా థియేటర్లకు ఆడియన్స్ అంత త్వరగా రారు అనేది సినీ పండితుల అభిప్రాయం. దానితో అందరూ తప్పక ఏకీభవించాల్సిందే.
ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతల పాలిట ఓ వెలుగులా కనిపిస్తోంది ఓటీటీ. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన `పెంగ్విన్` చిత్రం ఈనెల 19న విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందనే వస్తోంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నటించిన మరో సినిమా ఓటీటీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉంది. కానీ, లాక్డౌన్ కారణంగా విడుదల నిలిచిపోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.













