సుశాంత్ సింగ్ మరణంతో వివాదంలో బాలీవుడ్ ప్రముఖులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌ను కుదిపేసింది. దేశవ్యాప్తంగా సగటు సినీ ప్రేక్షకులను ఆవేదనకు గురిచేసింది. పలువురు సినీ నటులు తన సహచరుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్త తట్టుకోలేక తన వదిన ఓ అభిమాని మృతి చెందారు. బాలీవుడ్‌లోని ఓ గ్రూపు మాఫియాగా వ్యవహరించడం వల్లే సుశాంత్ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులపై కేసు నమోదు కావడం సంచలనం రేపుతున్నది. వివరాల్లోకి వెళితే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అన్యాయం జరిగిందంటూ బీహార్‌కు చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదు చేశారు. సుశాంత్ మరణానికి పరోక్షంగా సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ కారణమంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఈ సినీ ప్రముఖులను విచారించాలని కోర్టుకు తన పిటిషన్లో నివేదించారు.
సుధీర్ కుమార్ ఓజా కేసు నమోదు చేసిన అనంతరం మాట్లాడుతూ..” సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్‌తోపాటు మొత్తం తొమ్మిది మందిపై కేసు ఫైల్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.”
బాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేయడానికి కారణం వెల్లడిస్తూ… సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను చాలా రకాలుగా వేధించారని , యువ హీరోను దాదాపు ఏడు సినిమాల నుంచి ప్లాన్ ప్రకారం తొలగించారని . కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకొన్నారని. అలాంటి చర్యలు సుశాంత్ మనస్తాపానికి గురిచేశారని ఆ కారణంగానే ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు తీవ్రమైన నిర్ణయం తీసుకొని జీవితాన్ని చాలించాడానీ అని ఓజా పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని కొన్ని గ్రూపులపై కంగన రనౌత్, శేఖర్ కపూర్, అభివన్ కశ్యప్ లాంటి వాళ్లు తీవ్రంగా స్పందించారు. సుశాంత్‌ది సూసైడ్ కాదు. పక్కా ప్లాన్డ్ మర్డర్ అంటూ కంగన వ్యాఖ్యలు చేయడం పెను సంచలనం రేపింది. అలాగే అభివన్ కశ్యప్ సల్మాన్ ఖాన్ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికొత్త వివాదానికి దారి తీసింది.













