శేష్ ఆషామాషీగా ఒప్పుకోలేదు
మేజర్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అడివి శేష్ ఆ సినిమా హిట్ అయ్యాక ఆ సక్సెస్ ను క్యాష్ చేసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. వచ్చిన ఫేమ్ ను అలాగే కాపాడుకుంటూ మంచి సినిమాలు చేయాలని చూస్తున్న శేష్ రీసెంట్‌గానే గూఢచారి2ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాతో పాటూ శేష్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడయోస్ సమర్పణలో సునీల్ నారంగ్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందనున్న సినిమాలో శేష్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు క్షణం, గూఢచారి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షానియేల్ డియో దర్శకత్వం వహించనున్నాడు.
క్షణం మూవీ టైమ్ లోనే షానియేల్ పనితనాన్ని గుర్తించిన శేష్, మంచి కథ ఉంటే కలిసి పని చేద్దామని చెప్పాడట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఈ విషయంలో చర్చలు నడిచాయని, దానికి తోడు షానియేల్ చేసిన లైలా అనే షార్ట్ ఫిల్మ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అఫీషియల్ గా ఎంట్రీ అవడంతో ఆయన పనితనంపై మరింత నమ్మకం ఏర్పడి శేష్ ఈ ఛాన్స్ ఇచ్చాడు తప్పించి ఆషామాషీగా కాదని తెలుస్తోంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే లో షానియేల్తో పాటూ శేష్ కూడా భాగం కాబోతున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో మిగిలిన టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.













