లేట్ చేసినా శేష్ ది బెస్టే!
స్పై బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆడియన్స్ ను లైట్ తీసుకున్నా, స్క్రిప్ట్ ను లైట్ తీసుకున్నా దాని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఇయర్ గూఢచారి నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
నిఖిల్ హీరోగా వచ్చిన స్పై మంచి హోమ్ వర్క్ లేక తేలిపోయింది. వరుణ్ తేజ్ చేసిన గాండీవధారి అర్జున సినిమాను ఓటీటీలో కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రిలీజ్ అయిన టైగర్3 మూవీకి కూడా డివైడ్ టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ ఇమేజ్, షారుఖ్ క్యామియో, హృతిక్ రోషన్, ఎన్నో కోట్ల బడ్జెట్ ఇవేవీ సినిమాకు సూపర్‌హిట్ టాక్ ను తీసుకురాలేకపోయాయి. అందుకే స్పై బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు స్క్రీన్ ప్లే ముఖ్యమని పదే పదే చెప్తుంటారు.
ఈ విషయంలో టాలీవుడ్ నటుడు అడవి శేష్ ను మెచ్చుకోకుండా ఉండలేం. గూఢచారి సినిమాకు బడ్జెట్ పరిమితులున్నప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొని మరీ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత శేష్ క్రేజ్ పెరిగింది. స్వయంగా మహేష్ బాబు తన బ్యానర్ లో శేష్ తో మేజర్ మూవీ చేశాడు. ఆ సినిమా కూడా హిట్ అయింది. శేష్ క్రేజ్ ఇంకా పెరిగింది.
క్రేజ్ ఉందని శేష్ ఎప్పుడూ తొందరపడలేదు. గూఢచారి2 కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. డైరెక్టర్ ను మార్చాల్సి వచ్చినా రాజీ పడకుండా, స్క్రిప్ట్ విషయంలో ఎంత లేటయినా పర్లేదు కానీ క్వాలిటీ కంటెంట్ ను డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో ఎంతో గుట్టుగా ఈ స్క్రిప్ట్ ను వండిస్తున్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టే శేష్ సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది.













