Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్న తులసి
సినీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అనేది దాదాపు ఉండదు. వయసు అయిపోయి అవకాశాలు తగ్గిపోవడం వల్లనో, లేకపోతే ఓపిక లేకపోవడంతోనో సినిమాలకు దూరంగా ఉంటారు తప్పించి రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం చాలా అరుదు. కానీ ప్రముఖ నటి, ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన తులసి(Tulasi) తన సినీ కెరీర్ కు ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారు.
ఈ ఏడాది డిసెంబర్ 31 వ తేదీ నుంచి తాను యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా తులసి అనౌన్స్ చేశారు. తులసి నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేశారు. అప్పట్నుంచి తెలుగు, కన్నడ, తమిళ, భోజ్పురి భాషల్లో 300కి పైగానే సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మధ్యలో పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటూ కెరీర్ నుంచి బ్రేక్ తీసుకున్న తులసి, సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఎన్నో సినిమాల్లో చాలా మంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించి ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్ ను దక్కించుకున్న తులసి కొన్నాళ్ల నుంచే సినిమాలు తక్కువగా చేస్తూ వచ్చింది. గత కొన్నాళ్లుగా సాయి బాబాపై భక్తిని పెంచుకున్న తులసి, రిటైర్మెంట్ గురించి తన ఇన్స్టాలో హ్యాపీ రిటైర్మెంట్ అని రాసిన గ్రీటింగ్ కార్డును పోస్ట్ చేస్తూ డిసెంబర్ 31న షిర్డీ వెళ్తున్నానని, ఆ రోజే తన రిటైర్మెంట్ కూడా ఉంటుందని, ఆ తర్వాత సాయి బాబాకు సేవ చేసుకుంటూ బతికేస్తానని తన పోస్ట్ లో పేర్కొనగా ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.













