‘కమిట్మెంట్’ తో తేజస్వికి హీరోయిన్గా బ్రేక్ వస్తుందా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చిత్రాతిచిత్రంగా ఉంటుంది. కొంతమంద తొలి సినిమాతోనే పాపులర్ అయిపోయి టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోతారు. కొంతమంది మాత్రం చిన్నా చితక క్యారెక్టర్స్ చేస్తూ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అవకాశం వచ్చిందా సరేసరి, లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే మిగిలిపోతారు. ఇటీవలి కాలంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో చిన్న క్యారెక్టర్ చెయ్యడం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తేజస్వికి సరైన బ్రేక్ రాలేదు. రామ్‌గోపాల్‌వర్మ `ఐస్‌క్రీమ్`లో ప్రధాన పాత్రలో కనిపించినా ఆ సినిమా ఆమెకు ఉపయోగపడలేదు. ఆ తర్వాత నలుగురు హీరోయిన్లలో ఒకరిగా, హీరోయిన్ ఫ్రెండ్‌గా.. ఇలా వచ్చిన అవకాశం వదులుకోకుండా సినిమాలు చేస్తూ ఎప్పటికైనా బ్రేక్ రాకపోతుందా అని ఎదురుచూస్తోంది. ఆమధ్య బిగ్‌బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన తేజస్వి ఆ షో ద్వారా కొంత పాపులారిటీ సంపాదించుకోగలిగింది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉండే ఈమె ఫాలోవర్స్‌ని కూడా బాగానే సంపాదించుకుంది. తాజాగా తేజస్వి చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.
అయితే ఈసారి కూడా నలుగురు హీరోయిన్లలో ఒకరిగా చేస్తోంది. అయితే ఇంతకుముందు ఈమె చేసిన సినిమాలకు కాస్త భిన్నంగా ఉండే ఈ సినిమా తప్పకుండా తనకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతోంది. `కమిట్మెంట్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్వితోపాటు రమ్య పసుపులేటి, సిమర్ సింగ్, అన్వేషి జైన్ నటిస్తున్నారు. సినిమాల్లోకి వచ్చి హీరోయిన్లుగా వెలుగొందాలని ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అనే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. కాగా, జూలై 3 తేజస్వి పుట్టినరోజు సందర్భంగా హాట్‌గా ఈ సినిమాలోని ఒక స్టిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ స్టిల్ చూస్తుంటే సినిమాలో మరిన్ని హాట్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఏది ఏమైనా తేజస్వికి `కమిట్మెంట్` మంచి అవకాశమనే చెప్పాలి. మరి ఈ సినిమాతోనైనా ఆమెకు హీరోయిన్గా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.













