అదే నా ఎదుగుదలకు కారణం
కళాకారులకు సంతృప్తి ఉండకూడదు అంటోంది తమన్నా. ఎందుకు అని అడిగితే? అన్నీ సాధించేశాం అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుండాలి. నేనెప్పుడూ చేసినా పనితో సంతృప్తి పడిపోను. ఇంకా దేనికోసమో అన్వేషిస్తుంటాను. అదే నా ఎదుగుదలకు కారణమంది. ఇటీవల విడుదలైన ఎఫ్ 2తో చక్కటి విజయాన్ని అందుకుంది తమన్నా. తను మాట్లాడుతూ మిగిలిన వాళ్లతో పోలిస్తే నాకు మంచి పాత్రలే దక్కాయి. కథానాయిక అంటే పాటలకే పరిమితం అనుకున్న సందర్భాల్లోనూ నాకంటూ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను మరిన్ని మంచి పాత్రల కోసం రోజూ ఎదురుచూస్తూనే ఉంటాను. చేతిలో ఎన్ని సినిమాలున్నా, ఎన్ని మంచి పాత్రలు చేసినా ఈ నిరీక్షణ ఆగదు. రిటైర్మెంట్ ముందు రోజు వరకూ అది కొనసాగుతూనే ఉంటుంది అంటోంది. ప్రస్తుతం క్వీన్ రీమేక్‌గా వస్తోన్న దటీజ్ మహాలక్ష్మిలో నటిస్తోంది తమన్నా.













