శ్రీనిధి ఆశలన్నీ దానిపైనే!
టైమ్ కలిసిరానప్పుడు ఎంత కష్టపడినా ఆ ఫలితమేమీ కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడదు. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి విషయంలోనూ ఇదే జరుగుతుంది. కేజీఎఫ్ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించి, మెప్పించిన శ్రీనిధికి ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుస పెట్టి అవకాశాలు రావాల్సింది కానీ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కేజీఎఫ్ కంటే ముందే ఓకే చేసిన విక్రమ్ కోబ్రా సినిమా కూడా బాగా ఆడకపోవడంతో శ్రీనిధి కెరీర్‌కు మరింత దెబ్బ కొట్టింది. దీంతో శ్రీనిధికి ఆఫర్లు రావడం తగ్గాయి. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో అమ్మడుకి టాలీవుడ్ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చిందని టాక్. బాబీ దర్శకత్వంలో రానున్న బాలయ్య సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీనిధిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ డిస్కషన్స్ అయితే జరిగాయని, అమ్మడుని ఫైనల్ చేశారని టాక్. భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వొచ్చు. ఇదే కానీ నిజమైతే శ్రీనిధికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. బాలయ్య లాంటి హీరోతో హిట్ పడితే తర్వాత సీనియర్ల సరసన ఛాన్స్ వచ్చే అవకాశముంది. ఎలాగూ ఇప్పటికే విక్రమ్ తో సినిమా చేసింది కాబట్టి ఆ అనుభవం కూడా పనికొస్తుంది. దీంతో బాలయ్యతో చేసే సినిమాపైనే శ్రీనిధి తన ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అయినా శ్రీనిధి కెరీర్ గ్రాఫ్ ను పెంచుతుందేమో చూడాలి మరి.













