డేంజర్ జోన్ లో శ్రీలీల కెరీర్
పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీలీల ఆ సినిమా తర్వాత మంచి అవకాశాలను అందుకుంది. ఏకంగా రెండో సినిమాగా రవితేజతో ధమాకా చేసి హిట్ కొట్టేసింది. దీంతో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. చిన్న హీరో నుంచి పెద్ద స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ అందుకుని ప్రస్తుతం తీరిక లేనంత బిజీగా ఉంది.
ధమాకా తర్వాత రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమాలో నటించిన శ్రీలీలకు ఆ సినిమా వల్ల ఒరిగిందేమీ లేదు. పైగా సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్ కూడా కాదు. ఆ సినిమా రిలీజై, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రీసెంట్ గా బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి తో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్ లో వేసుకుంది.
అంతా బాగానే ఉంది కానీ శ్రీలీలకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక సోలో హిట్ కావాలి. భగవంత్ కేసరి హిట్ ను మొత్తం శ్రీలీలకే ఇచ్చేయలేం. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలంటే కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా చేసే సినిమాలతోనే సక్సెస్ అందుకోవాలి. హీరోయిన్ గా శ్రీలీల నుంచి మూడు సినిమాలొస్తే అందులో రెండు డిజాస్టర్లే.
సో, ఇప్పుడు ఎలాగైనా అమ్మడికి హిట్ అవసరం. శ్రీలీల చేస్తున్న ఆది కేశవ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే అది శ్రీలీల కెరీర్ పై ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఆదికేశవ తర్వాత డిసెంబర్ లో నితిన్ ఎక్స్ట్రా సినిమా, జనవరిలో రానున్న గుంటూరు కారం సినిమాల రిజల్ట్స్ శ్రీలీల కెరీర్ పై ప్రభావం చూపనున్నాయి. ఈ మూడు సినిమాల ఫలితాలు తేడా కొడితే మాత్రం శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్ లో పడ్డట్టే!













