ప్రణీతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించగానే ఒక్కసారిగా దేశం స్తంభించిపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రెక్కాడితేగానీ డొక్కాడని కొన్ని లక్షల కుటుంబాల జీవితాల్లో అంధకారంగా అలముకుంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కొంతమంది నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా తమ మానవత్వాన్ని చాటుకున్నారు. సినీ ప్రముఖులు ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.
హీరోయిన్ల విషయానికి వస్తే అందరి కంటే ముందుగా స్పందించింది ప్రణీతా సుభాష్. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు కష్టకాలంలో ప్రజను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళం అందించిన మొదటి హీరోయిన్గా అందరి మనసుల్లో నిలిచిపోయింది. అంతేకాదు 50 కుటుంబాకు 2 వేల రూపాయల చొప్పున నగదు అందించింది. నెల రోజులపాటు 75,000 కుటుంబాలకు భోజనాన్ని ఉచితంగా అందించింది. భోజనాల తయారీని దగ్గరుండి చూసుకుంటూ తను కూడా భోజనాల ప్యాకెట్స్‌ను రెడీ చేసింది. లాక్డౌన్ ప్రకటించి రెండు నెలలు దాటిపోయింది. ఈ రెండునెలల్లో ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన పెద్ద మనసును చాటుకుంది.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల సినీ ప్రముఖులు తమ అభిమానుల్లో ధైర్యం నింపేందుకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక సందేశాన్ని అందిస్తూనే ఉన్నారు. కొంతమంది అభిమానులకు వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. హీరోయిన్ ప్రణీత మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ప్రజల్లోకి వెళ్లి వారికి సేవ చేయడం ద్వారా తన సేవా నిరతిని చాటుకుంటోంది. ఇటీవల కర్ణాటకలోని 100 మంది ఆటో డ్రైవర్లకు ప్రణీత ఫౌండేషన్ ద్వారా శానిటైజర్లు పంపిణీ చేయడమే కాకుండా డ్రైవర్‌కు, ప్రయాణికుకు మధ్య పారదర్శకంగా ఉండే షీట్స్‌ను కూడా పంచిపెట్టారు ప్రణీత. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ప్రణీత వెల్లడించింది. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. లాక్డౌన్ అనగానే ఇంట్లో కూర్చోకుండా పదిమందికీ సేవ చేస్తున్న ప్రణీతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.













