నిదానమే ప్రధానమంటున్న మృణాల్
ఏ భాషలో అయినా సరే సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు డెబ్యూతోనే మంచి బ్లాక్ బస్టర్ పడితే, ఆఫర్ల వర్షం కురవడం మామూలే. ఆ ఆఫర్లకు ఆశపడి, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని సినిమాలను ఓకే చేస్తుంటారు. అలా తొందరపడిన వాళ్లకు నిరాశలే ఎక్కువ ఎదురవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా కృతి శెట్టి, శ్రీలీలనే చెప్పుకోవాలి.
ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకున్న కృతికి ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాపులుగా నిలవడంతో ఇప్పుడు చేతిలో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం కృతి చేతిలో శర్వానంద్ సినిమా తప్ప మరోటి లేదు. ఇక శ్రీలీలకు భగవంత్ కేసరి తప్ప వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్లు తగిలాయి. దీంతో శ్రీలీల ఆశలన్నీ ఇప్పుడు గుంటూరు కారంపైనే ఉన్నాయి.
కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం ఎన్ని ఆఫర్లొచ్చినా చాలా స్లోగా నిదానమే ప్రధానం అంటూ మంచి సినిమాలకే ఓటేస్తుంది. సీతారామం సినిమా వచ్చి సంవత్సరం దాటినా కానీ తొందరపడి సినిమాలను ఒప్పుకోకుండా నిదానంగా ఆలోచించి హాయ్ నాన్న చేసింది. అందుకు తగ్గట్టే హాయ్ నాన్న మంచి హిట్ అయింది.
అమ్మడు నుంచి నెక్ట్స్ ఫ్యామిలీ స్టార్ రానుంది. ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి. క్లీన్ ఎంటర్టైనర్ గా పరశురామ్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది కాకుండా చిరంజీవి విశ్వంభరకు కూడా మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఐదుగురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో త్రిష ఆల్రెడీ కన్ఫర్మ్ కాగా మరో హీరోయిన్ గా మృణాల్ ఫైనల్ అయిందని టాక్.













