సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
మళ్లీ టాలీవుడ్ నటి మాధవీలత వార్తల్లోకి ఎక్కారు. ఓ వర్గం వ్యక్తుల మనోభావాలను కించపరుస్తూ ట్విటర్లో వ్యాఖ్యలు చేసినందుకు సినీనటి మాధవీలతపై రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె తన ట్విటర్ ఖాతాలో ఉగ్రవాద కార్యకలాపాల విషయమై ఓ వర్గానికి ఆపాదిస్తూ చేసిన కామెంట్లపై హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన కళాశాల విద్యార్ధి గోపీకృష్ణ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కామెంట్స్ ఒక కమ్యూనిటీని కించపరిచేలా, మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు మాధవీలతపై ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ హరినాథ్ తెలిపారు. గతంలోనూ మాధవీలత పలు రకాల కామెంట్స్, ప్రకటనల ద్వారా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.













