సినీ నటుడు వేణుమాధవ్‌కు బెదిరింపులు
వైకాపా కార్యకర్తలు చంపుతామని బెదిరిస్తున్నారంటూ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు వేణుమాధవ్ కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తాను నంద్యాల ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం కర్నూలుకు వచ్చానని, ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల సమయంలో వైకాపా కార్యకర్తలు తన చరవాణికి ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. అదే రోజు రాత్రి 10:30 గంటల సమయంలో రాజశేఖర్‌రెడ్డి అనే వైకాపా కార్యకర్త తనను దూషిస్తూ 10 నిమిషాల నిడివిగల వీడియోని యూట్యూబ్‌లో పెట్టారన్నారు. మరో వ్యక్తి దూషిస్తూ 26 నిమిషాల నిడివిగల వీడియోను యూట్యూబ్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. మరికొందరు చంపుతామని బెదిరిస్తున్నారని, వారిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని విన్నవించారు.













